Revanth Reddy | రేవంత్ రెడ్డి.. ఈ పేరు వింటేనే తెలంగాణ ప్రజానీకం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎందుకంటే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక.. అన్నివర్గాలను నట్టేట ముంచినందుకు. ఒక్క సంక్షేమ పథకం లేదు.. అభివృద్ధి పథకాల ఊసే లేదు. ఆరు గ్యారెంటీలు ఆనవాళ్లు లేవు.. 420 హామీలకు దిక్కే లేదు. కానీ తానేదో ఈ 11 నెలల కాలంలో తెలంగాణను గొప్పగా ఉద్దరించినట్టు ఊకదంపుడు ఉపన్యాసాలు. ఇక రేవంత్ కోతలను చూస్తుంటే.. ప్రజలకు విసుగు పుట్టించేలా ఉన్నాయి. అయినా కూడా తానేదో తెలంగాణలో సాధించినట్టు.. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని బిల్డప్‌లు ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో 11 నెలల కాలంలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేశామని, 40 వేల ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలు అందించామని, రైతులకు రుణమాఫీ చేశామని అబద్దాలు కుమ్మరించాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో కూడా గ్యారెంటీలు అమలు చేసి, ఉద్యోగ, ఉపాధి కల్పన చేసి తీరుతామని ఉచిత హామీలు ఇచ్చారు. కానీ మహారాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి మాటలను నమ్మలేదు. ఆయన గారడీ విద్యకు బలికాలేదు. తెలంగాణలో ఏం జరుగుతుందో పసిగట్టిన మరాఠీలు రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు. మహా వికాస్ అఘాడీలో భాగమైన కాంగ్రెస్ పార్టీకి ఊహించినంత ఓట్లు పడలేదు. కాంగ్రెస్ ఘోర పరాభావం పాలైంది. మొత్తం 101 స్థానాల్లో పోటీ చేయగా, ప్రస్తుతం 22 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ఇక రేవంత్ రెడ్డి తెలంగాణలో పాలనను గాలికి వదిలేసి.. ప్రభుత్వ హెలికాప్టర్‌ను వినియోగించుకుంటూ మహారాష్ట్రలో చక్కర్లు కొట్టారు. రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు.. తన మంత్రివర్గాన్ని కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ఆదేశాలు జారీ చేశారు. మంత్రులతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మహారాష్ట్రలో పనిగట్టుకుని ప్రచారం చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్‌తో పిల్లలు ఆస్పత్రుల పాలైనా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారించింది రేవంత్ సర్కార్. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా.. పత్తి కొనుగోలు చేయకుండా రైతులను నట్టేట ముంచారు. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా.. సంక్షేమ, అభివృద్ధి పథకాల జోలికి వెళ్లకుండా.. పాలనను పక్కన పెట్టి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు రేవంత్ రెడ్డి. అయినా ఆయన సాధించింది ఏంది..? ఇటు తెలంగాణలో పాలన అస్తవ్యస్తం.. అటు మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం. ఏ ఒక్క లాభం కూడా జరగలేదు.
ఇవి కూడా చదవండి..
Jharkhand | బీజేపీ ఆశలు గల్లంతు.. జార్ఖండ్ పీఠం హేమంత్‌దే
Ajit Pawar | అబ్బాయ్ ఆశలు ఆవిరి..! బాబాయ్‌కి మళ్లీ పెద్ద పోస్టే వరించేనా..?