హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనానికి రాజకీయ ‘మూలాలు’ కదులుతున్నాయి. గులాబీ కండువాలు కప్పుకొనేందుకు అక్కడి నేతలు క్యూ కడుతుండడంతో అన్ని పార్టీల్లోనూ ఆందోళన మొదలైంది. రాజకీయ అధికార సోపానంలో స్థానిక సంస్థలే మూలమని తెలిసిందే. సోమవారం మహారాష్ట్రకు చెందిన ఏకంగా 76 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం అక్కడి అన్ని పార్టీలను కలవరానికి గురిచేసింది. బీఆర్ఎస్ విధానాలు, పార్టీ అధినేత సీఎం కేసీఆర్ దార్శనికత ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తున్నది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నుంచి కొన్నిరోజులుగా చేరికల వరద కొనసాగుతున్నది.
సీనియర్ రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, మేధావులు పలు రంగాలకు చెందిన ప్రముఖులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతి.. తమ పల్లెల్లోనూ కావాలనే నినాదంతో మహారాష్ట్రలోని అమరావతి డివిజన్‌కు చెందిన 76 మంది వివిధ పార్టీలకు చెందిన సర్పంచులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇందులో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతోపాటు రాయత్ సంఘటన, వంచిత్ బహుజన్ అఘాడీ, షెటారీ సంఘటనతోపాటు వివిధ పార్టీలకు చెందినవారు ఉన్నారు. సర్పంచులు, ఉప సర్పంచులు, మహారాష్ట్ర మీడియా యూనియన్‌కు చెందిన పలువురు గులాబీ కండువాలు కప్పుకొన్నారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడు సీఎం కేసీఆర్‌పై విశ్వాసంతో తెలంగాణ పల్లెలు ఎలా కదిలాయో.. ఇప్పుడు అదే విశ్వాసంతో తెలంగాణ మాడల్ అభివృద్ధికోసం మహారాష్ట్ర పల్లెలు బీఆర్ఎస్కు జై కొడుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
పార్టీలో చేరిన ముఖ్య ప్రజా ప్రతినిధులు