హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకొచ్చిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి మహారాష్ట్ర జై కొడుతున్నది. ఇప్పటికే మూడు సభల విజయవంతంతో జోష్‌లో ఉన్న బీఆర్ఎస్.. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 22 వరకు మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. గ్రామస్థాయినుంచి నియోజకవర్గస్థాయి దాకా పార్టీ కమిటీలు, 9 పార్టీ అనుబంధ కమిటీలను వేసేందుకు సమాయత్తం అవుతున్నది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు ఇతర పార్టీలనుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. సోమవారం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో చంద్రపూర్, పర్భణి, లాతూర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీ పార్టీల మాజీ ప్రజాప్రతినిధులు గులాబీ కండువాలు కప్పుకొన్నారు. పర్భణి జిల్లావ్యాప్తంగా ప్రభావితం చేయగల నాయకత్వం బీఆర్ఎస్లో చేరడంతో ఆ జిల్లాలో రాజకీయాలను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలచుకొన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే 25 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పలు జిల్లాల నుంచి మాజీ జడ్పీ చైర్పర్సన్లు, మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు, వివిధ నగర పాలక సంస్థల కార్పొరేటర్లు, కౌన్సిలర్లుసహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన జిల్లా, నియోజకవర్గ, తాలూకా బాధ్యులు బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్లోకి పర్భణిలో పట్టున్న నేతలు
మహారాష్ట్రలోని పర్భణి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగల రాజకీయ కుటుం బం బీఆర్ఎస్లో చేరడం మహారాష్ట్రలో చర్చనీయాంశం అయ్యింది. పర్భణి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మహేశ్ మాధవరావ్ ఫాడ్ కుటుంబానికి ఆ జిల్లాలో మంచి పేరున్నది. మహేశ్ తండ్రి మాధవరావ్కు జిల్లా స్థాయిలో పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. అలాగే ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే మోహన్ఫాడ్ పఠారి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మహేశ్ ఫాడ్ గులాబీ కండువా కప్పుకోవడంతో జిల్లా రాజకీయాలను బీఆర్ఎస్ తనవైపునకు తిప్పుకున్నదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఫాడ్ కుటుంబం చేరికతో పర్భణి జిల్లా రాజకీయ సమీకరణాలు మారనున్నాయని, ఆ జిల్లా నుంచి పలువురు సీనియర్ రాజకీయ నాయకులు బీఆర్ఎస్వైపు ఆసక్తిగా చూస్తున్నారని మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం పేర్కొన్నారు.
చంద్రపూర్, లాతూర్ నుంచి వలసలు
చంద్రపూర్ జిల్లా జివాది మున్సిపల్ మాజీ చైర్మన్ సంతోష్ గోట్వాలే సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చంద్రపూర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా సంతోష్ గోట్వాలేకు మంచి పేరున్నది. అలాగే ఇదే రాజూరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన భానుదాశ్ జాదవ్, చంద్రపూర్ జిల్లా జివాది తాలూకా నేషనలిస్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిష్ నమ్వాద్, కేకెజరి గ్రామ సర్పంచ్ మోరె మారుతి, బీజేపీ ముంబై కార్మిక విభాగం అధ్యక్షుడు దిలీప్ ర ఖ్, లాతూర్ జిల్లాకు చెందిన న్యాయవాదులు అఖిల్ దేశ్‌ముఖ్, బాలాజీ దరియా తదితరులు గులాబీ కండువాలు కప్పుకొన్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం తదితరులు పాల్గొన్నారు.