BRS | హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడుకు ఆ రాష్ట్ర పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. సీఎం కేసీఆర్ వరుస పర్యటనలు ఆ రాష్ట్ర రాజకీయ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బీఆర్ఎస్కు అడ్డుకట్ట వేయకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయా పార్టీలు గ్రహించాయి. అందుకే బీఆర్ఎస్పైనా, సీఎం కేసీఆర్ పైనా అవాకులు చెవాకులు పేలుతున్నాయి. తాజాగా శివసేన మౌత్‌పీస్ అయిన సామ్నా పత్రిక నిరాధార ఆరోపణలకు దిగింది.
గతంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఆరోపించినట్టుగా బీజేపీకి బీఆర్ఎస్ బీ- టీమ్ అని కథనం ప్రచురించింది. సోమ,మంగళవారాల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి సోలాపూర్, దారశివ్ జిల్లాల్లో జరిపిన పర్యటన మహారాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది. ఈ పర్యటనపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. భారీ కాన్వాయ్‌తో దండయాత్ర చేసినట్టుగా.. బలప్రదర్శన కోసం వచ్చినట్టు ఉందని ఆరోపించాడు.
ఈ పరిణామాలను ముందే ఊహించిన సీఎం కేసీఆర్ సర్కోలి సభలోనే సరైన సమాధానమిచ్చారు. తాము ఏ పార్టీకీ ఏ, బీ టీమ్ కాదని.. తాము ప్రజల టీమ్ అని కుండబద్ధలు కొట్టారు. నాందేడ్‌లో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం.. సోలాపూర్ చేరేసరికి జైత్రయాత్రగా మారింది. కేసీఆర్ పర్యటించిన ప్రాంతాల్లో ఆయనపై జనం పూలవర్షం కురిపించారు. బీఆర్ఎస్కు జై కొడుతున్నారు. మహారాష్ట్రలో స్వల్ప వ్యవధిలోనే బీఆర్ఎస్ విస్తరణ ఈస్థాయిలో ఉంటుందని ఊహించని అక్కడి నాయకులు, పార్టీలు బీఆర్ఎస్పై విమర్శలకు దిగుతున్నారన్నది స్పష్టంగా అర్థమవుతున్నది.