Maharashtra elections | ముంబై, నవంబర్ 11( నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండు కూటములు విదర్భ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. 62 నియోజకవర్గాలు ఉన్న విదర్భలో పాగా వేస్తే అధికారానికి దగ్గరైనట్టే అని కూటములు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇక్కడి ప్రజలను ఆకర్షించి మెజార్టీ సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే రెండు కూటముల నుంచి అగ్రనేతలు విదర్భ మొత్తాన్ని చుడుతూ ప్రచారం చేస్తున్నారు. ఎక్కువగా పత్తి పండించే రైతులు ఉన్న ఈ ప్రాంతంలో రైతులు ఎటువైపు నిలుస్తారనేది గెలుపోటములను నిర్ణయించనుంది.
విదర్భలోని మొత్తం 62 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 36 స్థానాల్లో ప్రత్యక్షంగా తలపడుతున్నాయి. 11 జిల్లాలు కలిగిన విదర్భ ప్రాంతం 1990ల వరకు కాంగ్రెస్కు కంచుకోట. మూడు దశాబ్దాలుగా ఇక్కడ బీజేపీ – శివసేన కూటమి పట్టు పెంచుకుంది. 2014లో ఇక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 44 స్థానాలను గెలుచుకుంది. 2019లో 29 స్థానాలకు పడిపోయింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో మాత్రం మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ఇక్కడ మంచి ఫలితాలను సాధించింది. విదర్భలోని 10 లోక్సభ స్థానాల్లో ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో విదర్భలో పాగా వేసేందుకు ఎంవీఏ ప్రయత్నిస్తున్నది. ఆరెస్సెస్ కేంద్ర కార్యాలయం విదర్భలోనే నెలకొని ఉండటం, రాష్ట్ర బీజేపీకి జోడుగుర్రాల్లాంటి దేవేంద్ర ఫడ్నవీస్, చంద్రశేఖర్ బవాంకులే ఈ ప్రాంతానికి చెందిన వారే కావడంతో బీజేపీ ఈసారి విదర్భ ప్రాంతాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది.