హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు కాణిపాకం దేవస్థానం తరపున ఈవో పెంచల కిశోర్ దంపతులు.. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈవో జే శ్యామలరావు దంపతులు, అధికారులు పట్టువస్త్రాలను సమర్పించారు.
సాయంత్రం పుష్పాలంకృత శోభితులైన శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మయూర వాహనంపై అధిరోహింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీగిరి వీధుల్లో స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది. శివదీక్ష శివ స్వాముల పంచాక్షరి నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది.