హైదరాబాద్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): పాల బిల్లులు చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో విజయ డెయిరీ పాడి రైతులు గురువారం హైదరాబాద్‌లో మహాధర్నాకు పిలుపునిచ్చారు. విజయ పాడి రైతుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఇందిరాపార్క్ వద్ద ఈ భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పాడి రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో రైతులు సన్నాహక సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే పాడి రైతుల ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చే అవకాశం ఉన్నది. అయితే ధర్నాకు వచ్చే పాడి రైతుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఏ గ్రామం నుంచి ఎంతమంది వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు? వంటి వివరాలను తెలుసుకుంటున్నట్టు తెలిసింది.
విజయ డెయిరీ పాడి రైతులకు సుమారు మూడు నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటివరకు సుమారు రూ.150 కోట్ల వరకు పెండింగ్ బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో బకాయిలు చెల్లించాలంటూ పాడి రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడెక్కారు. రోడ్లపై పాలు పారబోసి నిరసనలకు దిగారు. ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేశారు. కానీ ప్రభుత్వం నుంచి బకాయిల చెల్లింపుపై కనీస స్పందన రాలేదు. ఈ విధంగా ఓవైపు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో పాడి రైతులు చివరి పోరాటానికి సిద్ధమయ్యారు.
పాడిరైతులు మహాధర్నాకు పిలుపునివ్వడంతో ప్రభుత్వంలో కాస్త కదలిక వచ్చింది. రూ.50 కోట్ల బకాయిలు విడుదల చేసినట్టు విజయ డెయిరీ ప్రకటించింది. ఈ బిల్లులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. బుధవారం కొందరికి రెండు బిల్లులు, ఇంకొందరికి ఒకే బిల్లు జమ చేయగా మరికొంత మందికి నయా పైసా ఇవ్వలేదు. అయితే ఇదంతా తమ ఆందోళనను ఆపేందుకు ప్రభుత్వం చేస్తున్న డ్రామాగా పాడి రైతులు అనుమానిస్తున్నారు. మొత్తం బకాయిలు చెల్లించేవరకు తమ పోరాటం ఆగదని, గురువారం నాటి ధర్నా యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో కులవృత్తులపై రేవంత్‌రెడ్డి సర్కార్ కత్తికట్టిందని కేటీఆర్ విమర్శించారు. మత్తడి దుంకే చెరువుల్లో మత్స్య సంపద సృష్టించిన నీలి విప్లవాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా చేప పిల్లల పంపిణీ మొదలు కాలేదని, టెండర్ల దశ దాటనే లేదని, ఆ ప్రక్రి య ఉంటుందో, లేదో ఎవరికీ తెలియని గందరగోళం నెలకొన్నదని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాడి రైతులను కాంగ్రెస్ సర్కార్ పడావుపెట్టేలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తమ పాల బిల్లులు ఇవ్వాలని రైతులు రోడ్డెక్కి నిరసన చేస్తే భయపడిన ప్రభుత్వం రూ .150 కోట్ల బకాయిల్లో కేవలం రూ. 50 కోట్లే విడుదల చేసి చేతులు దులుపుకొన్నదని మండిపడ్డారు. ఎత్తు కుర్చీల్లో కూర్చోవడం కాదని, కన్నెత్తి రైతుల గోస కూడా చూడాలని కోరారు. మాఫీ కానీ రుణమాఫీ, పత్తాలేని పాల బిల్లులు, భరోసాలేని రైతు భరోసా, బోనస్ పేరుతో బోగస్ మాటలు అని దుయ్యబట్టారు. బోగస్ హామీలతో రైతుల గొంతు నొకి గద్దెనెకి రాచరిక దర్పాన్ని ప్రదర్శిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.