నిజామాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ వ్యవసాయ మార్కె ట్ యార్డులో పసుపు రైతులు మోసపోతున్నారు. వ్యాపారులు, దళారుల మాయాజాలం.. రైతుల పొట్టకొడుతున్నది. ఏటా పసుపు కొనుగోళ్లలో ఈ తరహా దందా బహిరంగంగానే కొనసాగుతున్నది. వ్యాపారుల సిండికేట్ మహాత్యమా? లేకపోతే పరిస్థితుల కారణమా? తెరవెనుక అభూత శక్తుల ప్రమేయమో తెలియదు కానీ చివరికి రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పసుపు పంట కొనుగోళ్లకు పెట్టింది పేరు. ఉత్తర తెలంగాణలోని రైతులంతా లక్షలాది క్వింటాళ్ల పసుపును తీసుకువచ్చి అమ్ముకుంటారు. జనవరి నెలలో ఏటా పసుపు అమ్మకాలు ప్రారంభమవుతాయి. 2025 ప్రారంభంలో మొదలైన కొనుగోళ్లలో గరిష్ఠ ధర రూ.8 వేలు మించలేదు. రైతులు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం జోక్యంతో రూ.9 వేలతో కొనుగోళ్లు అరకొరగా చేపట్టారు. ప్రస్తుతం కొనుగోళ్లు ముగిసే సమయంలో మార్కెట్లో ధర అమాంతం పెరిగింది. అయితే అమ్ముకునేందుకు రైతుల వద్ద పంట లేదు. పండించిన పసుపు ఇప్పటికే తక్కువ ధరకు విక్రయించిన వారంతా లబోదిబోమంటున్నారు.
ముగింపులో రూ.13,850
పసుపు కొనుగోళ్లు ముగింపు సమయంలో క్వింటాల్‌కు రూ.13,850 ధర పలుకుతున్నది. మార్కెట్‌కు మొన్నటి వరకు రోజుకు 30వేల క్వింటాళ్ల మేర పసుపు వచ్చేది. ఇప్పుడు గరిష్ఠంగా రోజుకు 800 నుంచి 900 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నది. పసు పు రాక మందగించడంతో వ్యాపారులు ధర పెంచి కొనుగోళ్లు చేపడుతున్నారు. వాస్తవానికి పసుపును పండించే రైతులంతా జనవరి, ఫిబ్రవరి నెలాఖరులోనే ప్రాసెసింగ్ చేపట్టి మార్కెట్‌కు తీసుకువస్తారు. ఇప్పుడు మార్కెట్‌కు చేరుకుంటున్న పసుపు పంట బడా వ్యాపారులకు సంబంధించినదిగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ మాయాజాలంతో రైతులు నష్టపోతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుత ధరలు ఇలా..
నిజామాబాద్ మార్కెట్లో పసుపు ఫింగర్ రకానికి గరిష్ఠ ధర రూ.13,850, కనిష్ఠ ధర రూ.9,527 పలుకుతున్నది. పసుపు బల్ప్ గరిష్ఠ ధర రూ.12,600, కనిష్ఠ ధర రూ.8,006 చొప్పున క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. చూర రకానికి గరిష్ఠ ధర రూ.11,801 పలుకుతున్నది.
మహారాష్ట్ర నుంచి పసుపు రాక
పసుపు ధర అమాంతం పెరిగిన ఈ సమయంలో లాభాలు మన ప్రాంత రైతులకు దక్కాల్సి ఉంది. విచిత్రంగా ధరలు పెరిగినప్పుడల్లా సామాన్యులకు ఆ ఫలాలు అందడం లేదు. ఈ అవకాశాన్ని పొరుగున ఉన్న మహారాష్ట్ర రైతులు అందిపుచ్చుకొంటున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి రైతులు పసుపు పంటను తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఏకంగా క్వింటాలు పసుపు ధర రూ.14 వేలకు చేరువైంది. ఈ పరిస్థితులను గమనిస్తున్న రైతులు లబోదిబోమంటున్నారు. పసుపు బోర్డు తెచ్చామంటూ బీజేపీ గొప్పలు చెబుతుండగా గిట్టుబాటు ధర కల్పించడంలో చొరవ తీసుకోకపోవడంపై పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి పసుపు తెచ్చిన
నిజామాబాద్‌లో ధర వస్తుందని తెలుసుకున్నా. మొత్తం 140 బస్తాలు తీసుకువచ్చిన. సుమారు 80 క్వింటాళ్ల వరకు ఉం టుంది. క్వింటా ధర రూ.13 వేలు చెబుతున్నారు. మొన్నటి వరకు రూ.10 వేలు కూడా రాలేదు. అందుకే ఇప్పుడు అమ్ముకుంటున్నా. ఒకటే ధరను పెడితే రైతులకు లాభం ఉంటది. ధరల్లో హెచ్చుతగ్గుదలతో రైతులకు నష్టం జరుగుతుంది.
– సంతోష్ మంగల్, ముద్కేడ్, మహారాష్ట్ర