హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన షేక్ మదీనా ఎనిమిదేండ్లపాటు మదర్సాలో ఆలీమ్, ఫాజిల్ కోర్సులు చదివింది. ఆ తర్వాత ఉన్నతవిద్య అభ్యసించాలనే అభిలాషతో ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి, ఇంటర్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఉపాధ్యాయురాలిగా ఎంపికవ్వాలనే పట్టుదలతో రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టి ఏకంగా రాష్ట్రస్థాయిలో డీఈ ఈసెట్లో 339 ర్యాంకు సాధించింది. నాలుగో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు తీసుకొస్తేనే అడ్మిషన్ ఇస్తామని డీఈఈసెట్ నిర్వాహకులు చెప్పడంతో నిశ్చేష్ఠురాలైంది. టీచర్ కావాలనే కలలు సర్టిఫికెట్ల మాటున కల్లలవుతుండటంతో కన్నీటిపర్యంతమైంది. ఇదీ ఒక్క షేక్ మదీనా ఎదుర్కొంటున్న సమస్యనే కాదు.. ఓపెన్ పద్ధతిలో టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై ఉన్నత విద్యవైపు అడుగులేయాలని కలలుగంటున్న వేలాదిమంది సమస్య.
రాష్ట్రవ్యాప్తంగా ఏటా వేలాది మంది విద్యార్థులు ఓపెన్ టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులవుతున్నారు. ఇందులో చాలామంది పాఠశాల విద్య అభ్యసించకుండానే నేరుగా టెన్త్, ఇంటర్ పాసవుతున్నారు. వీరికి పాఠశాలలో చదువుకున్న సర్టిఫికెట్లు లేకపోవడంతో ఉన్నతవిద్యతోపాటు ఉద్యోగావకాశాలకు దూరమవుతున్నారు. మండల రెవెన్యూ కార్యాలయాల ద్వారా ఎమ్మార్వోలు ధ్రువీకరించిన లోకల్ సర్టిఫికెట్లు తీసుకొచ్చినా డీఈఈసెట్, ఎప్సెట్, ఎడ్సెట్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి అనుమతించడంలేదు. అధికారులను అడిగితే తమకేం తెలియదని, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని సమాధానమిస్తున్నారు. దీంతో ఏటా వేలాదిమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఎంతో కష్టపడి చదివి ఓపెన్ విధానంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసి ఉన్నతవిద్యను అభ్యసించాలనుకుంటే తమకు నిరాశే మిగులుతున్నదని విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిసారించాలని కోరుతున్నారు. ఓపెన్లో చదువుకున్న వారికి స్కూల్ సర్టిఫికెట్ల నిబంధనలు ఎత్తివేయాలని, ఎమ్మార్వో జారీ చేసిన లోకల్ ధ్రువీకరణ పత్రాలతో డీఈఈసెట్, బీఈడీ ఇతర సెట్ల ద్వారా అర్హత పొందిన వారికి ప్రవేశాలు కల్పించాలని విజ్ఞప్తిచేస్తున్నారు. విద్యార్థుల ప్రతిభను పక్కన బెట్టి కేవలం సర్టిఫికెట్లు లేవనే కారణంతో నిరాకరించడం సమానత్వ భావనకు విరుద్ధమని చెబుతున్నారు. స్కూల్ సర్టిఫికెట్లనే ప్రామాణికంగా తీసుకొంటే మరీ ఓపెన్ విద్యా వ్యవస్థను అమల్లోకి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు. పాసైన వారిని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం ఉన్నతవిద్యకు దూరం చేయడం తగదని ఆక్షేపిస్తున్నారు. వెంటనే విద్యాశాఖ ఈ విషయంపై దృష్టిపెట్టి విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి, మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.