హైదరాబాద్, అక్టోబర్7 (నమస్తే తెలంగాణ): మాదిగ సామాజికవర్గం అంటేనే కాంగ్రెస్ మొదటి నుంచీ అలుసుగా చూస్తున్నదని ఆ సామాజిక వర్గం నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 47 లక్షల మంది ఓటర్లు ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా ఆదిలోనే అవమానపరిచారని, ఎంపీ పదవులు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 18 నెలల తర్వాత ఒక్క నేతకు అవకాశం కల్పించి, చట్టసభల సాక్షిగా ఆయన పట్ల అవమానకరంగా వ్యవహరించటం దుర్మార్గమైన చర్య అని అభివర్ణిస్తున్నారు. టీజీపీఎస్సీ సభ్యులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వంటి సాధారణ పదవులను తమకు కట్టబెట్టి కీలక పదవులను వారు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర ఎస్సీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ‘దున్నపోతు’అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో చట్ట సభల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయం, అవమానాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
రేవంత్ సర్కారులో అన్యాయం
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో తమకు ఆదినుంచీ అన్యాయమే జరుగుతున్నదని మాదిగ సామాజిక వర్గ నేతలు వాపోతున్నారు. మూడు దశాబ్దాల కలను నెరవేరుస్తూ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అనుమతించడం తెలిసిందే. ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామని, అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి మాట తప్పారని, వైద్య విద్య ప్రవేశాల్లో వర్గీకరణను అమలు చేయకుండా సహజ స్వభావాన్ని చాటుకున్నారని ఆరోపిస్తున్నారు. మూడు ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానాలు ఉంటే వీటిలో మాదిగలకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని తెలిపారు.
పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాను ఆర్థిక పలుకుబడి కలిగిన మాల నేతలకు, వరంగల్ నియోజకవర్గాన్ని బైండ్ల సామాజికవర్గానికి చెందిన మహిళకు ఇచ్చారని, ఒక స్థానంలో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వకుండా తమను నిర్దాక్షిణ్యంగా అణచి వేశారని చెప్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం జనాభా ప్రాతిపదికన ఇద్దరు మాదిగలు, ఒక మాల సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని పోటీలో నిలిపిందని గుర్తుచేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ఎంపీ టికెట్లు ఇవ్వడం సరికాదని మాదిగ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బక జడ్సన్ బాహాటంగా అభిప్రాయాన్ని తెలిపితే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనపై ఆరేండ్ల పాటు బహిషరణ వేటు వేసిందని, ఇప్పుడు దళిత మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మీద కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు.
రేవంత్ తొలివేటు మాదిగ నేతపైనే
రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దెనెకాక నామినేటెడ్ పదవుల భర్తీలోనూ మాదిగలకు అన్యాయమే జరిగిందని, తొలి జాబితాలో 34 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులిస్తే.. మాదిగ సామాజికవర్గంలో ఒకరికి మాత్రమే చోటు కల్పించారని ఆ వర్గంవారు స్పష్టంచేస్తున్నారు. అది కూడా సంప్రదాయబద్ధంగా వస్తున్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవేనని చెప్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ మాదిగలకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శిస్తున్నారు. తన రాజకీయ ఎదుగుదలలో మాదిగలు కీలకపాత్ర పోషించారని స్వయంగా రేవంత్‌రెడ్డి పలు బహిరంగ సభలు, సమావేశాల్లో చెప్పారని, ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన మాదిగలను శత్రువులుగా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాదిగ సామాజికవర్గానికి రాజకీయంగా జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని పలుమార్లు ఆయన బహిరంగంగా కోరినా రేవంత్ స్పందించలేదని, రేవంత్ పాలనలో తమ కులం రాజకీయంగా అణచివేతకు గురవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో మొదటి బహిషరణ వేటు మాదిగ సామాజికవర్గానికి చెందిన జడ్సన్పైనే పడిందన్న విషయాన్ని చరిత్ర ఎన్నటికీ మరచిపోదని స్పష్టంచేస్తున్నారు.
ఒత్తిడి తెచ్చామని అవమానిస్తరా?
రెండోసారి మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు మంత్రి పదవి వడ్డించిన విస్తరిలో ఏమీ రాలేదని, రహస్య సమావేశాలు పెట్టొద్దన్న కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలను ధికరిస్తూ.. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయి కాంగ్రెస్‌కు సవాల్ విసరడం వల్లే దిగి వచ్చారని మాదిగ సామాజిక వర్గం నేతలు గుర్తుచేస్తున్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు మాట్లాడుకొని తమ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారని, పలు విధాలుగా మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గి అడ్లూరికి మంత్రి పదవి ఇచ్చారని, ఒత్తిడి తెచ్చి పదవులు పొందిన కారణంగానే అడుగడుగునా అవమానిస్తున్నారని చెప్తున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయనకు వంత పాడిన మంత్రి వివేక్‌పై చర్యలు తీసుకోకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు.