Congress | హైదరాబాద్, అక్టోబర్ 13 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటనపై మల్లగుల్లాలు పడుతున్నది. తెలంగాణలోనే కాదు.. మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. పితృపక్షాల తర్వాత తొలి లిస్టును విడుదల చేస్తామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ప్రకటించినప్పటికీ అసలు విషయం వేరే ఉన్నదన్న వార్తలు వెలువడుతున్నాయి.
ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్టు సమాచారం. టికెట్ రానివాళ్లు పార్టీ మారే అవకాశాలుంటాయని, ఇలాంటి వాళ్లను బుజ్జగించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తున్నది. కాగా, ఇప్పటికే తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఒకే దఫాలో అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.