హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనకు సంఘీభావంగా ఈడీ కార్యాలయానికి వెళ్లిన రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మన్నె క్రిశాంక్, మేడే రాజీవ్‌సాగర్, పల్లె రవికుమార్‌గౌడ్, నేతలు సుమిత్రానంద్, పావనీగౌడ్, కీర్తిలతాగౌడ్, ఖుషీ సమ్ము తదితరులను పోలీసులు అరెస్టు చేసి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి బీఆర్ఎస్ నేతలను పరామర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలపై రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ నుంచి విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే తట్టుకోలేక కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి రాహుల్‌గాంధీ కార్యకర్తలతో రావొచ్చుకానీ, కేటీఆర్ విచారణకు హాజరైనప్పుడు తాము వస్తే తప్పేంటని రాజీవ్‌సాగర్ ప్రశ్నించారు.