హైదరాబాద్, మార్చి 27 ( నమస్తే తెలంగాణ ) : సింగరేణి సంస్థను బొగ్గు టెండర్ల నుంచి మినహాయించాలని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్, రెగ్యులేషన్ యాకు ్ట-215 టెండర్ల నుంచి సింగరేణిని మినహాయించాలని కోరారు. ఈ టెండర్ విధానం వల్ల సింగరేణి సంస్థ మనుగడకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని మైనింగ్ కంపెనీని టెండర్ల నుంచి మినహాయించారని, సింగరేణి సంస్థకు ఈ అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు.
ఇంజినీరింగ్ విధానంపై మాజీ సీఎం కేసీఆర్‌కు ఉన్న అవగాహన తాను ఇంత వరకు ఎవరి వద్దా చూడలేదని ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి కొనియాడారు. రాజోలిబండ ప్రాంతాల్లో గతంలో 87,000 ఎకరాలకు నీళ్లు వస్తుండగా, ఇప్పుడు కేవలం 57,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తున్నాయని తెలిపారు. అందుకోసం చిన్నంపల్లి రిజర్వాయర్‌కు 6 కిలోమీటర్ల లింకు పూర్తయితే రెండు టీఎంసీల నీళ్లొస్తాయని తెలిపారు. అందుకోసం కేవలం రూ.40 కోట్లు ఖర్చవుతాయని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
ఎల్ఆర్ఎస్లో అనేక ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు చేసుకున్నప్పుడే ఫీజు ఎంత చెల్లించాల్సి ఉంటుందో తెలిపే వారని, కానీ ఇప్పుడు ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుందో నోటీసులు వచ్చేంతవరకు తెలియడం లేదని గుర్తుచేశారు.
రాష్ట్రంలోని పోలీసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి రెండేండ్లుగా నిలిచిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదలయ్యేలా ప్రభుత్వం చ ర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి కోరారు. వారికి ఏకీకృత సర్వీసులను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.
అమరుడు యాదయ్య
తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుడు సిరిపురం యాదయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రభుత్వాన్ని కోరారు. యాదయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, దానిని వెంటనే పూర్తిచేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.