జయశంకర్ భూపాలపల్లి, మార్చి 1 (నమస్తే తెలంగాణ): భూపాలపల్లి నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నదని, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా? అని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు శనివారం సిరికొండ మధుసూదనాచారిని కలిశారు. నియోజకవర్గంలో సాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పంటలు ఎండిపోతున్నా పాలకులు ఏ మాత్రం స్పందించడం లేదని, ఇటీవలే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నీటికోసం ధర్నా చేశారని గుర్తుచేశారు. అయినా అధికారులు, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని ఇరిగేషన్ ఈఎన్సీ శంకర్‌కు ఫోన్‌చేసి సూచించారు. డీబీఎం-16, డీబీఎం-18, డీబీఎం-38 కాల్వల్లో నీటి విడుదల స్థాయిని పెంచాలని, తద్వారా చలివాగు, పెద్ద వాగు ద్వారా పొలాలకు నీరు అందేలా చూడాలన్నారు. డీబీఎం- 38 నుంచి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని కోరారు. ముచ్చర్ల నాగారంలో లెవల్ తూము ద్వారా నీటిని పెద్దవాగుకు విడుదల చేసి పంటలను కాపాడాలని, అన్నంపెట్టే రైతన్నల ఆక్రందనలను ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని సూచించారు. పరిస్థితి విషమిస్తే రైతుల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు.