హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ గ్యారెంటీలపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో గురువారం ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ నేత యాదయ్యగౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రావడం కోసమే నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చినట్టు స్పీకర్ వ్యాఖ్యలతో మరోసారి రుజువైందని తెలిపారు. ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చిందని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వ్యాఖ్యానించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 13 నెలల తర్వాత స్పీకర్‌కు ఈ విషయం బోధపడిందా? అని ప్రశ్నించారు.
ఎన్నికల హామీల అమలుపై రేవంత్ సర్కారు చేతులెత్తేసిందా? అని నిలదీశారు. ‘ఎన్నికల సమయంలో ఇన్ని హామీలు ఎలా అమలు చేస్తారని మీడియా అడిగితే.. ‘అప్పులు తెలుసు. తప్పులు తెలుసు. ఆదాయం సమకూర్చుకొనే మెళకువలూ తెలుసు. ఆర్థిక పరిస్థితిపై మాకు అవగాహన ఉన్నది’ అని భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతలు నాడు ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. గ్రామసభలు, సమావేశాలు మొత్తం డొల్లా అని చెప్పారు. అప్పుల గురించి కూడా కాంగ్రెస్ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 1.43 లక్షల కోట్లు అప్పులు చేసిందని విమర్శించారు.
రాష్ట్రంలో అప్పులబాధతోపాటు రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాక్షేమాన్ని గాలికొదిలిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మెడలు వంచి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూస్తామని చెప్పారు. ఇచ్చిన 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ చార్సౌ బీస్ (420) పార్టీగా మారిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. కేసీఆర్‌పై అబద్ధాలను ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు గోబెల్స్‌ను మించిపోయారని మండిపడ్డారు. గాంధీ విలువలను కేసీఆర్ పాటిస్తే.. వాటిని కాంగ్రెస్ పాలకులు తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.