హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై కుట్రలకు తెరలేపిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. పరిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశారని, రైతుల సాగునీటి ఘోస తీర్చేందుకు భగీరథుడిలా కంకణం కట్టుకున్నారని చెప్పారు. తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. తెలంగాణకు ఏం అన్యాయం చేశారని కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. వీటిని ముమ్మాటికీ కాంగ్రెస్ కక్ష సాధింపు నోటీసులుగానే పరిగణిస్తామని పేర్కొన్నారు. విచారణ పేరుతో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తే.. తెలంగాణ మరొకసారి మర్లబడతదని హెచ్చరించారు.
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా, ఇంకా ప్రజలు కేసీఆర్ పాలననే గుర్తు చేసుకుంటున్నారని, దీనిని ఓర్వలేకనే సీఎం రేవంత్‌రెడ్డి విచారణ పేరుతో కేసీఆర్‌కు నోటీసులు ఇస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభు త్వ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతో కాళేళ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు.