కవాడిగూడ, జనవరి 30: బీసీ విద్యార్థులంటే కాంగ్రెస్ సర్కార్‌కు లోకువ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. బీసీలపై వివక్షను విడనాడి, బీసీ విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద బీసీ విద్యార్థుల సమర శంఖారావం మహాసభలో ఆయ న ప్రసంగించారు. ఒక బీసీ బిడ్డగా ఈ ప్రభుత్వాన్ని తాను అడుగుతున్నామని, వెంటనే విడుదల చేయకపోతే బీసీలంతా ఒక్కటై ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.
విద్యార్థుల పై చేసే ఖర్చును పెట్టుబడిగా కాకుండా మాన వ వనరుల అభివృద్ధి కోణంలో చూడాలని హితవు పలికారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో కాకుం డా విద్యార్థుల హక్కుగా చూడాలని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. ఫీజు బకాయిలు 4,600 కోట్లు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పా లనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు.
విద్యార్థుల ఫీజు బకాయిలు ఇవ్వని ప్రభుత్వం.. కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెడుతున్నదని ధ్వజమెత్తారు. విద్యార్థుల పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్ వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. సభలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.