హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం తమ మోసాలను కప్పి పుచ్చుకోవడం కోసమే అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. శాసనమండలి సమావేశాలు జరిగిన విధానం ఏ మాత్రం బాగా లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, వాణీదేవితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలుగాని, వారికి ఇచ్చిన హామీలపై గాని ఎలాంటి చర్చ జరుగకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అసెంబ్లీ పవిత్రత దిగజార్చేలా ప్రభుత్వం వ్యవహరించిందని, కేవలం ఆరో రోజులు మాత్రమే మండలి సమావేశాలు నిర్వహించారని మండిపడ్డారు. శాసనమండలికి ఒకరిద్దరు క్యాబినెట్ మంత్రులు మాత్రమే హాజరయ్యారని విమర్శించారు. అసెంబ్లీలో ట్రీ బ్రేక్ పేరు తో గంటల గంటలు సభను వాయిదా వేశారని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. గతంలో తాను స్పీకర్గా పని చేసిన సందర్భంగా మినిట్ టు మినిట్ ప్రొసీడింగ్స్ ఉండేవని గుర్తు చేశారు. కానీ, ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి వచ్చేంత వరకు.. కనీసం రెండు గంటలకుపై గా సభను వాయిదా వేశారంటూ తప్పుపట్టా రు. ఒకరోజు దాదాపు నాలుగు గంటలకుపైగా సభను వాయిదా వేసి, తిరిగి రాత్రి 10 గంటలకు ప్రారంభించడాన్ని తూర్పారపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలపై తాను కూలంకుషంగా ప్రశ్నించినా ప్రభుత్వం ఒక్క సమాధానం కూడా చెప్పలేదని విమర్శించారు. అసెంబ్లీలో అప్పుడే బిల్లులు పెట్టి, అప్పుడే ఆమోదం తెలుపుతున్నారని, ఇదేం పద్ధతని నిలదీశారు. ఏ ఒక్క బిల్లుపై కూడా సమగ్రంగా చర్చ జరుగలేదని విమర్శించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇలాంటి సమావేశాలను తానెప్పుడూ చూడలేదని, శాసనమండలి సమావేశాల్లో రైతులు, నిరుద్యోగులు, మహిళలకు సంబంధించిన అంశాలపై అసలు చర్చకే రాలేదని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత ఎల్ రమణ విమర్శించారు. ఇలాంటి సమావేశాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. కాంగ్రెస్ నాయకులు ఇక్కడే పాలన సరిగా చేయడం లేదు కానీ, పక్క రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అక్రమంగా దోచుకున్న డబ్బులను ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. చేనేతల సమస్యలు పరిష్కరించకుంటే.. పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించలేదని, ఏదో సభ పెట్టాలి కాబట్టి పెట్టారని ఎమ్మెల్సీ వాణీదేవి విమర్శించారు. శాసనమండలిలో ప్రజా సమస్యలను చర్చించకుండా బడ్జెట్ సమావేశాలను నామమాత్రంగా నిర్వహించారని మండిపడ్డారు. సమావేశాలు ఇలా జరిగితే ప్ర జా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. స్కూళ్లలో సదుపాయాలు లేక బాలికలు అనేక ఇబ్బందులు పడుతున్నా, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.