ఏటూరునాగారం, డిసెంబర్ 6: తన భర్త ఎగలోపు మల్లయ్య అలియాస్ మధు మృత దేహంపై తూటా తగిలిన గాయం ఒక్కటి కూడా లేదని, తల పగులగొట్టి చిత్రహింసలకు గురి చేసి చంపేశారంటూ మధు భార్య మీనా ఆరోపించారు. ఈ నెల 1వ తేదీన చెల్పాక అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆరుగురి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీసుకెళ్లారు. ఎన్కౌంటర్ మృతిపై అనుమానం ఉందంటూ మధు భార్య మీనా తరఫున హైకోర్టులో లంచ్ మోషన్లో న్యాయవాది దశరథ్ పిటిషన్ వేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మీనా ములుగు జిల్లా ఏటూరునాగారం వచ్చిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు.
మధు మరణం ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటర్‌గా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని మండిపడ్డారు. ముందుగానే కుట్ర పన్ని విషం పెట్టి చంపేసిన తర్వాత శరీరాన్ని ఛిద్రం చేశారని ఆరోపించారు. నిజమైన ఎదురు కాల్పులు అయితే మీడియాను ఘటనా స్థలానికి ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. తహసీల్దార్ సమక్షంలో మధు మృతదేహాన్ని వీడియో చిత్రీకరణ, ఫొటోలు తీసుకునే అవకాశం కల్పించారని, మత ఎదుట ఎలాంటి పంచనామా, పోస్టుమార్టం చేయలేదని చెప్పారు. ఆదివాసీలను చంపడం మావోయిస్టుల లక్ష్యం కాదని, పోలీసులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. మల్లయ్య అలియాస్ మధు మృతదేహాన్ని మీనాతో పాటు బంధువులు తీసుకెళ్లారు.