హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోతే ప్రధాని మోదీ మెడలు వంచేది మాదిగలే అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఢిల్లీలో మాదిగ – మాదిగ ఉపకులాల లొల్లి వినిపించడానికి జంతర్ మంతర్, ధర్నా చౌక్ వేదికగా సోమవారం దీక్షా కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన అన్నారు.
దేశాన్ని ఏలుతున్న మోదీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఎస్సీ కులాల పట్ల ఎందుకీ వివక్ష ? అని ప్రశ్నించారు. సుమారు యాభై ఏళ్లుగా పరిష్కారం కానీ CAA – NRC, అయోధ్య రామమందిరం, త్రిబుల్ తలక్ ఆర్టికల్371 లాంటి అనేక క్లిష్టమైన సమస్యలను సైతం అతి తొందరగా పరిష్కారం చేశారు. కానీ మేం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి ఇప్పటివరకు ఉలుకు పలుకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర లతోపాటు కర్ణాటక లాంటి అనేక రాష్ట్రాల్లో ఎస్సీ లపై వివక్ష చూపుతున్నారని వాపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ సమాజంలో సామాజిక పంపిణీ సమానంగా జరగాలని, ఆ ఫలాలు సమపాళ్లలో పొందాలని ఆయన భావించారు.
ఆ ఆలోచనా విధానంతో మోదీ ఏబీసీడీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
వెంటనే ఆర్టికల్ 341(2) నీ సవరించి తక్షణమే ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.