Drugs | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): బెంగళూరు కేంద్రంగా నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు నలుగురు వినియోగదారులను టీజీ-న్యాబ్, సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.1.53లక్షల విలువ చేసే 12.72 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన గోసంగి వెంకటసాయిచరణ్ బెంగళూరులో డిగ్రీ పూర్తిచేసి, డ్రగ్స్ దందా మొదలు పెట్టాడు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ నగరాల్లో డ్రగ్ సరఫరా చేస్తున్నాడు. బెంగళూరు కేంద్రంగా చిన్న చిన్న కవర్లలో ఎండీఎంఎను ప్యాక్ చేసి, ప్రైవేటు ట్రావెల్ బస్సుల ద్వారా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటాడు. ఇందుకోసం డ్రైవర్లకు వంద రూపాయలు ఇచ్చి పలానా వ్యక్తులు వచ్చి తీసుకుంటారు, వారికి ఈ పార్శిల్ ఇవ్వమని చెబుతాడు. ట్రావెల్స్ డ్రైవర్లు వాటిని నగరానికి చేరుకున్న తరువాత సాయిచరణ్ సూచన మేరకు కస్టమర్లకు అప్పగిస్తారు. డ్రగ్స్ దందాపై నిఘా పెట్టిన టీజీ-న్యాబ్ పోలీసులు ఈ నెల 21న మాదాపూర్‌లో రెగ్యులర్ కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు వచ్చిన సాయిచరణ్‌ను పట్టుకున్నారు. డ్రగ్స్ కొనుగోలుకు వచ్చిన మాదాపూర్‌కు చెందిన మల్లిక్ లోకేశ్, సందీప్‌రెడ్డి, కూపట్పల్లికి చెందిన రాహుల్, సనత్‌నగర్‌కు చెందిన సుబ్రహ్మణ్యంను రిమాండ్‌కు తరలించారు.
గుర్తు తెలియని వ్యక్తులు అందించే అనధికారిక పార్శిల్స్‌ను తీసుకుంటే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని పోలీసులు ట్రావెల్స్ సంస్థలకు నోటీసులు జారీచేశారు. బస్సుల్లో లగేజీని తనిఖీ చేసేందుకు డాగ్ స్కాడ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిందితుడు సాయిచరణ్ ప్రధానంగా మార్నింగ్ స్టార్, రాజేశ్వరి, జీవీఆర్, చెర్రీ ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ పార్శిల్స్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.