Sheep Units | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆయా కులవృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పలు పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణలోని గొల్ల, కురుమలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో గొర్రె పిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే మాదాసీ కురువలకు కూడా గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మాదాసీ కురువలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. కులవృత్తులకు చేయూత అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు. కులవృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. ప్రభుత్వం కల్పించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి అని మాదాసీ కురువలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.