మంచిర్యాల : ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు విషయంలో పోచంపాడు గ్రామ శివారులోని వేంపల్లి, ముల్కల్లా గ్రామాలకు చెందిన దళిత, బీసీ సోదరుల భూములను తక్కువ ధరకు ( ఎకరానికి రూ.13.50 లక్షలు) కొనుగోలు చేస్తున్నారని.. అధికారులు, అధికార పార్టీ నాయకులు బెదిరించి వారి భూములను లాక్కుంటున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన వివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘ఈ సందర్భంగా నేను సూటిగా చెప్పదలుచుకున్నా. వాళ్లకు ఇవ్వవలసినంత నష్టపరిహారం న్యాయంగా చెల్లించి, ఆ స్థలంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ భయపెట్టి, బెదిరించి వాళ్ల దగ్గర నుంచి అన్యాయంగా భూములు గనుక తీసుకుంటే, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేం దళిత, బీసీ సోదరులకు అండగా ఉంటాం. ఇప్పుడు అక్కడ ఎవరు భూములు కొనుగోలు చేసినా, ఆ భూములను మళ్ళీ దళిత, బీసీ సోదరులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇప్పుడు మీరు తక్కువ ధరకు కొనుగోలు చేసిన భూమిని దళిత, బీసీ సోదరులకు అప్పగించవలసి వస్తుంది’ అని హెచ్చరించారు.
‘మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఆ భూమికి ఎంత రేటు ఉంటుందో అంత రేటు అక్కడ కొన్న వ్యాపారస్తులే అక్కడున్న దళిత, బీసీ సోదరులకు చెల్లించవలసి వస్తుందని అన్నారు. అప్పుడు నా మద్దతు కూడా పూర్తిగా వాళ్ళకే ఉంటుందని చెప్పారు. అప్పటి మార్కెట్ ధర చెల్లించకపోతే రైతులు వాళ్ళ భూమిని వాళ్లు ఆక్రమించుకుంటారని అన్నారు. వారికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసులు, వివిధ శాఖల అధికారులు పూర్తిగా అండగా ఉంటారని అన్నారు. అన్యాయానికి కొమ్ముగాసి, పేదవాళ్లను రోడ్డున పడేసి, మీరు వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుంటామంటే కరెక్టు కాదు’ అని మాజీ ఎమ్మెల్యే సూచించారు.
‘ఇప్పుడు ముల్కల్లా, వేంపల్లి గ్రామాలకు సంబంధించిన భూమి కోల్పోతున్న రైతులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని మాకు బాండు పేపర్ మీద రాసి ఇస్తున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారుల అండతో మమ్ములను బెదిరించి భూములు తీసుకున్నారు. మాకు న్యాయం చేయగలరు. మాకు ఇష్టం లేకున్నా భయంతోనే మా భూములు ఇచ్చి డబ్బులు తీసుకున్నాం. మేం భయభ్రాంతులకు గురై ఒప్పుకున్నాం’ అని రాసిచ్చారని ఆయన చెప్పారు. ‘కాబట్టి అక్కడ భూమి కొందాం అనుకుంటున్న ప్రతి వ్యక్తి ఒకటికి, పది సార్లు ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమి యజమానులైన దళిత, బీసీ సోదరులకు న్యాయం జరిగేంత వరకు సహకారం అందిస్తాం’ అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, పట్టణ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,TBGKS నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.