భద్రాద్రి కొత్తగూడెం/బయ్యారం/ ములుగు, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పోడు భూములకు పట్టాలిచ్చేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో 140 విడుదల చేయడంతో పలు జిల్లాల్లోని పోడు రైతులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో సీ. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్న కేసీఆర్.. ఆదివాసీల ఆరాధ్య దైవమని కొనియాడారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని బయ్యారం, కొత్తపేట, గౌరారం గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరిప్రియానాయక్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఏండ్లుగా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ పట్టాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న గిరిజనుల సమస్యకు పరిష్కారం చూపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించి జీవో జారీచేయడం చాలా సంతోషకరమని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఏండ్ల కిందటి సమస్యకు తెలంగాణ ఏర్పడిన తర్వాత శాశ్వత పరిష్కారం లభించినట్టయిందని ములుగు జిల్లాలోని పోడు రైతులు పేర్కొన్నారు. జీవో 140 విడుదల చేయడంపై సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోరిక రాహుల్ నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. పోడు రైతులకు పట్టాలు అందితే వారి కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.