హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌గా పేరొందిన టీ-హబ్ ఇతర రాష్ర్టాలకూ స్ఫూర్తినిస్తున్నది. తెలంగాణలోని టీ-హబ్ తరహాలోనే ఎం-హబ్‌ను నెలకొల్పేందుకు మహారాష్ట్ర సిద్ధమవుతున్నది. ఐటీ, ఐటీఈఎస్ నూతన పాలసీలో భాగంగా స్టార్టప్‌ల ప్రోత్సాహానికి హైదరాబాద్‌లోని టీ-హబ్ మాదిరిగా మరొక ఇంకుబ్యేషన్ హబ్‌ను ఏర్పాటుచేయబోతున్నట్టు మహారాష్ట్ర పరిశ్రమలశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి బల్దేవ్సింగ్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి’ అనే నినాదంతో ఏర్పడిన టీ హబ్ ఎంతోమంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడుతున్నది. భారతీయ, అంతర్జాతీయ స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో ట్యాబ్-32 పేరిట వివిధ బ్యాచ్‌లను నిర్వహిస్తున్నది. వ్యవసాయం, ఎడ్యుటెక్, ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, స్మార్ట్‌సిటీస్, స్మార్ట్ మొబిలిటీ, సస్టెయినబులిటీ వంటి విభాగాల్లో స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తున్నది. ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఆరో విడతకు 200 కంపెనీలు దరఖాస్తు చేసుకోగా 22 స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. ఇంజినీరింగ్, మొబిలిటీ, విద్యుత్తు వాహనాలు, ఐఓటీ, విద్య, ఆరోగ్య, న్యాయరంగాలు, కృత్రిమమేధ, మెషిన్‌లర్నింగ్ తదితర విభాగాల్లోని స్టార్టప్‌లను ఈ కార్యక్రమానికి ఎంపికచేశారు. ఆయా స్టార్టప్‌లకు మార్గనిర్దేశంతోపాటు, పెట్టుబడుల సమీకరణ, అంతర్జాతీయ మార్కెట్లో పరిచయం వంటివి చేస్తారు.
అంతర్జాతీయ కార్యక్రమాలు
తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీలో భాగంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సహకారంతో తెలంగాణ సార్టప్‌లకు టీ-హబ్ ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఇప్పటివరకు కోటి రూపాయల దాకా ఆర్థిక సాయం అందించింది. రెజిజ్.హైదరాబాద్ పేరిట 15పైగా ఇంక్యుబేటర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వందకుపైగా స్టార్టప్‌లకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. వివిధ దేశాల్లోని సంస్థలతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. దక్షిణ కొరియా స్టార్టప్‌లకు భారత మార్కెట్లో ప్రవేశవిధానం, వ్యాపార అవకాశాల గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. జపాన్‌తో కలిసి రోడ్ టు షైన్ ప్రోగ్రాం ద్వారా 20 స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించింది. లాట్రోబ్వర్సిటీతో కలిసి గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రాం ద్వారా ఆస్ట్రేలియా స్టార్టప్‌ల ఎదుగుదలకు తోడ్పడింది. ప్రపంచస్థాయి స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించేందుకు బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్నోవేషన్ ఏజెన్సీ, కెనడా, టోక్యో, స్వీడన్, దుబాయ్ తదితర దేశాలతో కలసి పనిచేస్తున్నది.