e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News సిరివెన్నెల అస్తమయం

సిరివెన్నెల అస్తమయం

  • ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో.. చికిత్స పొందుతూ మృతి
  • ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌, సీఎం సంతాపం
  • 800కుపైగా చిత్రాల్లో 3 వేలకుపైగా పాటలు
  • పండిత, పామరుల హృదయాలు గెలిచిన సినీకవి
  • మహా ప్రస్థానంలో నేడు సిరివెన్నెల అంత్యక్రియలు

ప్రణవంతో మొదలైన పాట ప్రయాణం ఆగిపోయింది.
ఆవేశాగ్ని పర్వతమై చెలరేగిన, లలితభావ గర్భితమై తులతూగిన పాటలతో సినీ కళామతల్లిని సిరివెన్నెలలో తానమాడించిన అక్షరార్చన మూగవోయింది.
గానం, కవనం ఉచ్ఛాసనిశ్వాసలు నిలిచిపోయాయి. విద్వత్తు, విద్యుత్తు కలనేతల కలంధార కాలంలో ఘనీభవించింది.
స్వరజతులకు అక్షరాలంకారాలు కూర్చిన పాటమాలి జగమంత కుటుంబాన్ని వదిలిపెట్టి నిష్క్రమించాడు. పండిత, పామరులను మెప్పించిన పాటసారి విరించి విపంచి గానమై విశ్రమించాడు.
అడిగేదేమీ లేదంటూనే ఆదిభిక్షువును ఆశ్రయించాడు.

తెలుగు సంగీత సాహిత్యానికి తీరని లోటు: ముఖ్యమంత్రి కేసీఆర్‌

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రక్రియలోనైనా అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం తెలిపారు. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాలు సాగిందని గుర్తు చేసుకున్నారు. సీతారామశాస్త్రి మరణం తెలుగు చలన చిత్రరంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -

హైదరాబాద్‌/ సిటీబ్యూరో, నవంబర్‌ 30 (నమస్తే తెలంగాణ): ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి (66) ఇక లేరు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ ఈ నెల 24న హైదరాబాద్‌ కిమ్స్‌ దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ‘సిరివెన్నెల’ సినిమా పేరునే ఇంటి పేరుగా సుస్థిరం చేసుకున్న సీతారామశాస్త్రి.. సుమారు 800కు పైగా చిత్రాల్లో దాదాపు 3 వేల పాటలు రాశారు. సినీరంగంలో ఆయన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం 11సార్లు నంది అవార్డులతో గౌరవించింది. సిరివెన్నెల చిత్రానికి రాసిన ‘విధాత తలపున’తోనే ఆయన తొలి నంది అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా నాలుగుసార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ‘కంచె’ చిత్రానికిగాను ఉత్తమ గేయ రచయితగా సైమా అవార్డు సొంతం చేసుకున్నారు.

ఆరేండ్ల క్రితమే ఊపిరితిత్తి తొలిగింపు

సిరివెన్నెలకు ఆరేండ్ల క్రితం సగం ఊపిరితిత్తి తీసేశారు. ఆ తర్వాత బైపాస్‌ సర్జరీ కూడా జరిగింది. రెండో వైపు ఊపిరితిత్తికి సైతం క్యాన్సర్‌ వ్యాపించడంతో వారం క్రితం ఆ భాగంలో సగం ఊపిరితిత్తి తీసేశారు. రెండు రోజుల తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అడ్వాన్స్‌డ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం కిమ్స్‌కు తీసుకువచ్చారు. ఇక్కడ రెండు రోజుల చికిత్సతో బాగానే కోలుకున్నారు. ప్రికాస్టమీ కూడా చేశారు. అయితే 45 శాతం ఉపిరితిత్తి తీసేయడం వల్ల మిగిలిన 55శాతం కూడా ఇన్ఫెక్షన్‌కు గురైంది. ఆక్సినేషన్‌ సరిగా లేకపోవడంతో ఐదు రోజుల నుంచి ఆయన ఎక్మో మిషన్‌పైనే ఉన్నారు. అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు తోడు.. శరీరమంతా ఇన్ఫెక్షన్‌ వ్యాపించింది. పరిస్థితి విషమించి.. మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు కన్నుమూశారు.

మహా ప్రస్థానంలో నేడు సిరివెన్నెల అంత్యక్రియలు

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలను బుధవారం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కిమ్స్‌ హాస్పిటల్‌ నుంచి ఉదయం 5గంటలకు శ్రీనగర్‌ కాలనీలోని స్వగృహానికి తీసుకెళ్లి, అనంతరం అభిమానుల సందర్శనార్థం ఉదయం 7గంటలకు ఫిల్మ్‌ చాంబర్‌కు సిరివెన్నెల భౌతికకాయాన్ని తరలించనున్నట్టు తెలిపారు. చివరి చూపు తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఉపరాష్ట్రపతి, ప్రధాని సంతాపం

సీతారామశాస్త్రి మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అత్యంత ప్రతిభావంతుడైన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తననెంతగానో బాధించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆయన రచనల్లో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుందని పేర్కొన్నారు. తెలుగుభాష ప్రాచుర్యానికి ఆయన ఎంతగానో కృషిచేశారని నివాళులు అర్పిస్తూ తెలుగులో ట్వీట్‌ చేశారు. సిరివెన్నెల మృతిపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు సానుభూతిని ప్రకటించారు.

విచారం వ్యక్తం చేసిన సీజేఐ

సిరివెన్నెల మరణం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో ఆయన సినీరంగ ప్రవేశం పాటకు ఊపిరులూదిందన్నారు. నలుగురి నోట పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని ఆయన సుసంపన్నం చేశారన్నారు.

మంత్రులు, ప్రముఖుల సంతాపం

సీతారామశాస్త్రి మృతి తెలుగు సాహితీలోకానికి, సినీ పరిశ్రమకు తీరని లోటు అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌, ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌, ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు నివాళులు అర్పించారు. తన పాటల ద్వారా సమాజంలో చైతన్యం నింపి, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, సురభి వాణీదేవి, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ నేత చంద్రబాబునాయుడు, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, రచయిత జూలూరి గౌరీశంకర్‌, పలువులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రముఖులు సీతారామశాస్త్రి మృతికి సంతాపం తెలిపారు.

అన్నమయ్య పాటా.. అనిపించేలా!

శ్రుతిలయలు సినిమాలో సిరివెన్నెల రాసినల’తెలవారదేమో స్వామీ’ అనే పాట అన్నమయ్య రాశారని అనుకునేవారు. అన్నమయ్య శైలిలో రాయడమే అందుకు కారణం. అయితే చిత్రదర్శకుడైన కళాతపస్వి కే విశ్వనాథ్‌ ఆ పాటకు పల్లవిని దాదాపుగా సూచించారు. ‘తెలవారదేమో స్వామీ’ అనే మాటలతో పాట మొదలుకావాలి. ఆ పల్లవిలో ‘అలమేలు మంగకు’ అని కూడా రావాలి. ఇదీ విశ్వనాథ్‌ కాగితం మీద రాసిచ్చిన సూచన. పాడబోయేది కర్ణాటక సంగీత దిగ్గజం బాలమురళి. అన్నమయ్య పాట అనుకొని ఆయన ఆశ్చర్యపోయేలా రాయాలని సిరివెన్నెల మనసులో అనుకున్నారు. విశ్వనాథ సూచించిన మాటలను ‘తెలవారదేమో స్వామీ.. నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు’ అంటూ తీర్చిదిద్దారు. మరుసటి రోజు రికార్డింగ్‌. ఏ కారణం వల్లనో బాలమురళి రాలేకపోతే అప్పటికప్పుడు జేసుదాసుతో పాడించారు స్వరకర్త మహదేవన్‌. ఆ పాట జనాదరణలో అంచులు చూసింది. గమ్మత్తైన విషయం ఏమిటంటే చాలాకాలం పాటు జేసుదాసు అది అన్నమయ్య కీర్తనే అనుకున్నారట. ఆ ఏడు నంది బహుమతుల కమిటీ కూడా అన్నమయ్య పాటేమో అనుకుని పక్కన పెట్టిందట. చివరకు సిరివెన్నెల రాసారని తెలుసుకుని అవార్డుకు ఎంపిక చేసింది. విశ్వనాథ్‌ సినిమాల్లో రాసిన పాటలకు నందులు వస్తే అంత తృప్తిగా ఉండదని ఓ సందర్భంలో సిరివెన్నెల చెప్పుకున్నారు. తన సినిమాలోని ప్రతిపాటలో ఆయన ఎంతోకొంత చెయ్యివెయ్యడమే అందుకు కారణం. వేరే చిత్రాలతో నాలుగు నందులు పొందిన తర్వాత సంపూర్ణమైన తృప్తి కలిగిందట.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement