హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): పుట్టుకతో వచ్చే పీటర్స్ అనోమలీ అనే వ్యాధికి నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (ఎల్వీపీఐ)కు చెందిన డాక్టర్ మురళీధర్ అత్యాధునిక ‘సిఫా’ శస్త్రచికిత్సను ఆవిష్కరించారు. సాధారణంగా పుట్టుకతో వచ్చే జన్యుపరమైన పీటర్స్ అనోమలీ (పీఏ) వ్యాధి వల్ల పిల్లల్లో దృష్టిలోపం ఏర్పడుతుంది. సకాలంలో చికిత్స అందించకుంటే చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యకు నల్లగుడ్డు ట్రాన్స్‌ప్లాంట్ ఒకటే శరణ్యం. దీన్ని పలుసార్లు చేయాల్సి ఉంటుంది. దీంతో అటు ఆర్థిక భారంతోపాటు దుష్ఫ్రభావాలు కూడా అధికం. దీనిని అధిగమించేందుకు డాక్టర్ మురళీధర్ రామప్ప 10 ఏండ్లపాటు పరిశోధన చేసి, కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలో నూతన చికిత్సా పద్ధతిని కనుగొన్నారు. 2012 నుంచి 34 మంది పిల్లలపై అధ్యయనం నిర్వహించారు. నల్లగుడ్డు ట్రాన్స్‌ప్లాంట్ అవసరంలేని ‘సిఫా’ అనే సరికొత్త పద్ధతిని కనుగొన్నారు.
ఈ పద్ధతిలో నల్లగుడ్డులోపల అభివృద్ధి కాని కణాలను తొలగిస్తామని, దీంతో ఆ చుట్టపక్కల ఉన్న ఆరోగ్యవంతమైన కణాలు నల్లగుడ్డు మొత్తం వ్యాపిస్తాయని డాక్టర్ మురళీధర్ వివరించారు. ఈ శస్త్రచికిత్స వల్ల పిల్లలకు శాశ్వతంగా కంటి చూపు రావడమే కాకుండా జీవితంలో ఈ సమస్య మళ్లీ రాదని చెప్పారు. కాగా, ఈ అధ్యయన ఫలితాలు ‘ది జర్నల్ ఆఫ్ కార్నియా అండ్ ఎక్స్టర్నల్ డిసీజెస్’లో ప్రచురితమయ్యాయి.