హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): మంగళవారం చంద్ర గ్రహణం ఏర్పడనున్నది. ఈ ఏడాదిలో ఇదే చివరి గ్రహణం. భూమి ఛాయలోకి చంద్రుడు వచ్చినప్పుడు లేదా సూర్యునికి, చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. మంగళవారం భూమి ఛాయ చంద్రునిపై పడటంతో చంద్ర గ్రహణం ఏర్పడుతుందని, దీనిని పెనంబ్రల్ గ్రహణం అంటారని జీఎం బిర్లా ఆర్కియాలాజికల్, ఆస్ట్రానామికల్ సైంటిఫిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొన్నది. ఈ గ్రహణం హైదరాబాద్లో పాక్షికంగా.. గౌహతి, కోల్కతా నుంచి పూర్తిగా కనిపిస్తుందని తెలిపింది. ఆ సమయంలో చంద్రుడు ఎర్ర రంగులో దర్శనమిస్తాడని, దీనినే ‘బ్లడ్ మూన్’గా వ్యవహరిస్తారని వివరించింది. తదుపరి చంద్ర గ్రహణం వచ్చే ఏడాది మే 6న సంభవిస్తుందని, అదికూడా పెనంబ్రల్ గ్రహణమేనని పేర్కొన్నది. చంద్ర గ్రహణం నేపథ్యంలో మంగళవారం యాదగిరిగుట్టలో ఉదయం 8.15 నుంచి రాత్రి 8 గంటల వరకు లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని మూసివేయనున్నారు.
హైదరాబాద్లో గ్రహణ సమయాలు
సాయంత్రం 5.40 గంటలకు పాక్షిక గ్రహణం ప్రారంభం.
గరిష్ఠంగా కనిపించేది సాయంత్రం 5.42 గంటల వరకే.
సాయంత్రం 6.19 గంటలకు పాక్షిక గ్రహణం ముగింపు.