నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 24 : రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ఎదుట పడిగాపులు కాసినా దొరకని పరిస్థితి. మంగళవారం నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో వినియోగదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసుల పహారా మధ్య 60 మందికి మాత్రమే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఆన్లైన్లో బుక్ కావడం లేదంటూ పలువురు ఆవేదన చెందారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీకి సిలిండర్లు వచ్చాయని తెలిసి వినియోగదారులు తరలివచ్చి ఎండలో సైతం ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాశారు.
జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో గోదాం వద్దకు 25 పంచాయతీల నుంచి వినియోగదారులు తెల్లవారుజామునే తరలివచ్చారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఇండెన్ గ్యాస్ ఏజెన్సీకి సుమారు 300 సిలిండర్లతో కూడిన ఓ లారీ మంగళవారం వచ్చింది. విషయం తెలుసుకున్న వినియోగదారులు కార్యాలయం ఎదుట సిలిండర్ల కోసం వేకువజామున నుంచే క్యూకట్టారు. ఖమ్మం జిల్లా తల్లాడ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్దకు మంగళవారం ఉదయం 6 గంటలకే ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు చేరుకున్నారు.