హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా వంటగ్యాస్ ధరలను పెంచటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. తెలంగాణ ఆడబిడ్డలు వినూత్నంగా నిరసన తెలిపారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ప్రారంభం రోజున బతుకమ్మల మధ్య గ్యాస్ బండలను ఉంచి ఆడిపాడారు. గ్యాస్ ధర పెంపుపై నిరసనగా పాటలు పాడి తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. 2014 కు ముందు రూ.410 ఉన్న వంటగ్యాస్ ధర మోదీ సర్కారు పుణ్యమా అని ఏడేండ్లలో రూ.952 కు చేరడంపై మహిళలు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. నాడు నెలకు రూ.200కుపైగా వచ్చిన సబ్సిడీ.. ఇప్పుడు రూ.20 కూడా ఇవ్వలేని దశకు మోదీ సర్కారు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యక్ష నగదు బదిలీ పేరుతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేయాలన్న కేంద్ర సర్కారు ఆలోచనను ఆక్షేపించారు.
14.2 కిలోల సిలిండర్ ధర (సబ్సిడీ, సబ్సిడీయేతర) తాజాగా రూ.15 పెరిగింది. ఈ ధరపెంపు బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు చమురు కంపెనీలు పేర్కొన్నాయి. దీంతో హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.952కు చేరుకున్నది. గతేడాది నవంబర్‌లో రూ.631.5గా ఉన్న ధర..11నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.305.50 పెరిగింది. మొత్తంగా మోదీ ఏడేండ్ల పాలనలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.523 పెరిగింది. మరోవైపు, లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, లీటరు డీజిల్‌పై 35 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ.107.09, లీటరు డీజిల్ రూ.99.75కు చేరుకున్నది.
తెలంగాణలో సుమారు 1.14 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున నెలకు ఒక సిలిండర్ వాడుతారని భావించినా.. 2014 మార్చి1 నాటికి దాదాపు రూ.467.40 కోట్లు చెల్లించేవారు. అప్పటినుంచి మోదీ సర్కారు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూనే ఉన్నది. తాజాగా బుధవారం కేంద్రం పెంచిన ధరతో సిలిండర్ ధర.. హైదరాబాద్‌లోనే రూ.952కు చేరింది. ఈ లెక్కన తెలంగాణలో వంట గ్యాస్ వినియోగదారులు కేంద్రానికి చెల్లించే మొత్తం.. ఏకంగా సుమా రు రూ.1085.28 కోట్లకు చేరిందంటేనే ప్రజలపై ఎంత భారం పడుతున్నదో ఊహించుకోవచ్చు. 2014 నవంబర్ 10 నాటికి ఎల్పీజీ సబ్సిడీ మొత్తం రూ.568 గా నిర్ధారించారు. అదికాస్తా.. సెప్టెంబర్ 1 నాటికి కనీసం నలభై రూపాయలైనా సబ్సిడీ వచ్చేది. ఇప్పుడు అదికూడా సగానికి పడిపోయింది. ఆ మొత్తమైనా వస్తుందో లేదో గ్యారంటీ లేదు. సబ్సిడీల వ్యవస్థను పూర్తిగా రద్దుచేసే యోచనలో భాగంగానే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా మహిళలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్రతిపాదించిన విద్యుత్ చట్టాల ముసాయిదాలో పేర్కొన్న నగదు బదిలీ ద్వారా రాయితీలు అన్నది కూడా ఇలాంటిదేమోనని సందేహం వ్యక్తంచేస్తున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పేరుతో గ్యాస్ కనెక్షన్‌ను ఉచితంగా ఇచ్చి గొప్పలు చెప్పుకొంటున్న సర్కారు మొదటి నెల తరువాత నుంచి గ్యాస్ రీ ఫిల్లింగ్ చేసుకోవాలంటే రూ.వెయ్యి కచ్చితంగా చెల్లించాల్సిందే. గ్యాస్ రీఫిల్లింగ్ చేసుకోలేక సిలిండర్లు ఇతరులకు అమ్మేసుకొన్నవారు ఉన్నారని సమాచారం.
సిలిండర్ ధరను వెయ్యికి పెంచిన బీజేపీ వలలో..
పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన బీజేపీ వలలో..
నిత్యవసర ధరలు వలలో.. పెంచింది బీజేపీ..
నల్లా చట్టాలతో రైతు ఉసురే తీస్తున్న వలలో..
రాకాసి బీజేపీ వలలో.. వద్దద్దు మనకద్దే వలలో..
ఉన్న ఉద్యోగాలు వలలో.. ఊడ బీకుతున్న వలలో
అబద్ధాలతోని వలలో.. ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ..