ఓదెల, ఆగస్టు 29: మిడ్ మానేరు, ఎగువ ప్రాంతాల నుంచి లోయర్ మానేరుకు (Lower Manair Dam) భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు లోయర్ మానేరు డ్యాం గేట్లు శుక్రవారం తెరువనున్నారు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పశువులు, గొర్రెల కాపర్లు, మత్స్యకారులు నదిలోకి వెళ్లవద్దని సూచించారు. రైతులు, ప్రజలు మానేరు నదిని దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరిచారు.
ఈ నేపథ్యంలో మానేరు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ కోరారు. శుక్రవారం ఉదయం లోయర్ మానేరు డ్యాం కరీంనగర్ గేట్లు తెరుస్తున్నామని కరీంనగర్ ఇరిగేషన్ సర్కిల్ నంబర్ 2 సూపరిండెంట్ ఇంజనీర్ రమేష్ తెలిపారన్నారు. లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాలలో గత రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు మిడ్ మానేర్ రిజర్వాయర్ నుంచి వస్తున్న వరద డ్యామ్ లోకి వచ్చి చేరుతుంది. దీనితో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. దీంతో స్పిల్వే వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉన్నందని, ప్రాజెక్టు దిగువన ఉన్న ఓదెల మండలంలోని మానేరు నది పరివాహక గ్రామాలైన గుంపుల, ఇందుర్తి, బాయమ్మపల్లి, రూప్ నారాయణపేట, పోత్కపల్లి, మడక, కనగర్తి, కేశవాపూర్, గుండ్లపల్లి గ్రామాల ప్రజలు, రైతులు, రైతు కూలీలు, పశువుల కాపరులు, చేపలు పట్టేవారు, లోతట్టు ప్రాంతాల వారు మానేరునదిని దాటే ప్రయత్నం చేయవద్దని ఎస్ఐ సూచించారు.