హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ నెల 4న తుఫాను ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో 5వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ మీదుగా అల్పపీడనం.. డిసెంబర్ 7 ఉదయం నాటికి పశ్చిమ వాయవ్యంగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని వెల్లడించింది. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు చుట్టూ పక్కల ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం పెరుగుతున్నది. ఉదయాన్నే దట్టమైన పొగ మంచు కమ్మేస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. రాబోయే ఐదు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం పాక్షిక మేఘావృతమై, పొగమంచు కురుస్తుందని పేర్కొన్నది. దక్షిణం నుంచి తూర్పు దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నదని తెలిపింది. ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుందని పేర్కొన్నది.
ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు
అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమలో పొడి వాతావరణం ఉన్నా కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు జల్లులు పడే అవకాశం ఉన్నది.