హైదరాబాద్, నవంబర్ 7(నమస్తేతెలంగాణ): మొంథా తుపాను సృష్టించిన బీభత్సాన్ని ప్రజలు మర్చిపోకముందే మరోసారి వాతావరణ పరిస్థితులు భారీ వర్షాలకు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ.. మరింత బలపడే అవకా శం ఉన్నదని, 16 నాటికి వాయుగుండంగా బలపడనుందని అంచనా వేసింది. ఈ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో 15 నుంచి తెలుగు రాష్ర్టాలతోపాటు తమిళనాడు, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.