Rains Forecast | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు, తూర్పు గాలుల ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఈనెల 29 నాటికి అది వాయుగుండంగా బలపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రాజన్న-సిరిసిల్ల, పెద్దపల్లి, జనగాం, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని చెప్పారు.
ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీకి కూడా వర్ష సూచన జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పార్వతీపురం మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరకోస్తా, యానాంలో తేలికపాటి వర్షాలు రెండు రోజుల పాటు, కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.