వారి ప్రేమకు పెద్దలు అంగీకరించారు.. కానీ విధి వారిని ఒక్కటి కానివ్వలేదు. ఎంగేజ్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో గల్ఫ్‌లో ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా.. అది తెలిసి ఊళ్లో ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన అందర్నీ కలిచివేసింది.
పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాతదాంరాజుపల్లికి చెందిన మక్కల సాయికుమార్(22), సిరిపూర్ గ్రామానికి చెందిన ఒల్లె శ్రుతి(20) ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు కూడా వారికి పెళ్లికి అంగీకరించారు. ఏడు నెలల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేశారు. అయితే తమకు రేకులు షెడ్డు మాత్రమే ఉండటంతో.. ఇల్లు కట్టుకున్నాకే పెళ్లి చేసుకుంటానని చెప్పి సాయికుమార్ గల్ఫ్ దేశమైన బహ్రెయిన్‌కు వెళ్లాడు. అక్కడ కూలీ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి కారణంగా ఈ నెల 1న సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
శనివారం రాత్రి ఈ విషయం తెలియడంతో శ్రుతి తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే రోజు అందరూ నిద్రించిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకోవాల్సిన ప్రేమ జంట మరణంతో రెండు గ్రామాలు విషాదఛాయల్లో మునిగిపోయాయి.