బయ్యారం, జూన్ 17: ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. ప్రియురాలు మృతిచెంది.. ప్రియుడికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన సోమవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డలో చోటుచేసుకుంది. కోటగడ్డకు చెందిన కొట్టెం లక్ష్మీనారాయణ -లీలావతి దంపతుల కూతురు రవళి (23)కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సాయన్నపేటకు చెందిన ఓ వ్యక్తితో మూడేండ్ల కిందట వివాహమైంది.
కొన్ని రోజులు వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ ఇరువురి మధ్య కలహాలు రావటంతో రవళి రెండేండ్లుగా భువనగిరి వద్ద కోళ్ల ఫామ్‌లో పనిచేస్తున్న తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నది. సొంతూరుకు వచ్చి వెళ్తున్న క్రమంలో ఇదే గ్రామానికి చెందిన మోండు వీరభద్రం కొడుకు రవీందర్‌తో రవళికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
గత ఏప్రిల్‌లో భువనగిరిలో ఉంటున్న రవళిని తీసుకొని రవీందర్ ఆంధ్రా ప్రాంతానికి వెళ్లి అక్కడే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు తమ పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారం క్రితం శ్రీకాకుళంలో ఉంటున్న వారిని తీసుకొచ్చి.. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మూడు రోజులుగా రవళి రవీందర్ ఇంటి వద్దనే ఉంటున్నది.
ఈ క్రమంలో సోమవారం ఉదయం ప్రేమికులిద్దరూ ఇంట్లోని ఇనుప రాడ్‌కు చున్నీలతో ఉరేసుకోగా రవళి మృతి చెందింది. రవీందర్‌కు ప్రాణాపాయం తప్పింది. అయితే.. రవళి మృతదేహాన్ని చూసిన రవీందర్ భయాందోళనతో కత్తితో చేతి మణికట్టు, గొంతు కోసుకొని మరోమారు ఆత్మహత్యకు యత్నించాడు.
కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సీఐ రవికుమార్, ఎస్సై ఉపేందర్ రవీందర్‌ను 108 వాహనంలో మహబుబాబాద్ ఏరియా దవాఖానకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం రవీందర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కేసు దర్యాప్తులో ఉందని ఎస్సై చెప్పారు.