నల్లబెల్లి, జూన్ 4 : రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటను అమ్మాయి తరఫు బంధువులు స్టేషన్లో నుంచి బయటకు లాక్కొ చ్చి దాడికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో బుధవారం చోటచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే హనుమకొండ జిల్లా ఆరెపల్లెకు చెందిన ఓ యువతి, పత్తిపాకకు చెందిన ఓ యువకుడు వారం రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం శనిగారంలోని అబ్బాయి బంధువుల ఇంటి వద్ద తలదాచుకున్నారు.
అమ్మాయి బంధువులు 20 మంది మంగళవారం శనిగారం వెళ్లి ఆశ్రయం ఇచ్చిన బాలరాజు, అతడి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. బుధవారం ప్రేమజంట రక్షణ కోసం నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నది. దాడికి పాల్పడిన వ్యక్తులపై బాలరాజు ఫిర్యాదు చేశాడు. మళ్లీ అమ్మాయి తరఫు బంధువులు 50మ ందికి పైగా తరలివచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రేమజంటను బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. అక్కడే ఉన్న అబ్బాయి తరఫు బంధువులు కూడా దాడి చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.