e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides పట్టపగలే దోపిడీ

పట్టపగలే దోపిడీ

పట్టపగలే దోపిడీ
  • ఏటీఎమ్‌లో నగదు పెడుతుండగా కాల్పులు
  • బైక్‌పై వచ్చి 5 లక్షలు దోచుకెళ్లిన దుండగులు
  • అడ్డుకోబోయిన సెక్యూరిటీగార్డు కాల్పుల్లో మృతి
  • మరో కస్టోడియన్‌కు తూటా గాయాలు
  • కూకట్‌పల్లి పటేల్‌కుంట ఏటీఎం వద్ద ఘటన
  • పక్కా రెక్కీతో ఉత్తరాది ముఠాల దుశ్చర్య
  • వెంటనే స్పందించిన పోలీసులు.. విస్తృత గాలింపు
  • సంగారెడ్డిలో నిందితులు పట్టుబడినట్టు సమాచారం
  • అధికారికంగా ధృవీకరించని పోలీసులు

గురువారం మిట్ట మధ్యాహ్నం. సమయం 1.40 గంటలు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని పటేల్‌కుంట. రోడ్డు పక్కనే హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎమ్‌ సెంటర్‌ ఉన్నది. రహదారిపై వాహనాలు రయ్‌మని దూసుకుపోతున్నాయి. ఆ పక్కనుంచే ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే ఏటీఎమ్‌లో డబ్బు నింపేందుకు ఓ వాహనం వచ్చి ఆగింది. అందులోనుంచి ఇద్దరు కస్టోడియన్లు, ఓ సెక్యూరిటీగార్డు రూ.11 లక్షలు తీసుకుని ఏటీఎమ్‌ వద్దకు వెళ్లారు. ఆ వెంటనే 30 ఏండ్ల లోపు వయసున్న ఇద్దరు దుండగులు నల్లటి పల్సర్‌బైక్‌పై అక్కడకు దూసుకొచ్చారు. తుపాకీతో సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపారు. అడ్డుకొనేందుకు వచ్చిన ఓ కస్టోడియన్‌పై కాల్పులు జరిపి.. చేతికందిన రూ.5 లక్షలతో ఉడాయించారు. పట్టపగలే అచ్చం థ్రిల్లర్‌ సినిమాను తలపించిన ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు ప్రాణాలు వదిలాడు. క్షణాలమీద స్పందించిన పోలీసులు.. 12 బృందాలను రంగంలోకి దింపి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గురువారం రాత్రి సంగారెడ్డిలో దుండగులను అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.

హైదరాబాద్‌ సిటీబ్యూరో/మూసాపేట, ఏప్రిల్‌ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ నడిబొడ్డున పట్టపగలే తుపాకీ పేలుళ్లు కలకలం సృష్టించాయి. పక్కా స్కెచ్‌తో ఇద్దరు దుండగులు ఏటీఎమ్‌లో నింపుతున్న రూ.5 లక్షలను కొట్టేశారు. అక్కడే నిల్చొని చూస్తున్న జనానికి ఏం జరుగుతుందో తెలిసేలోపే పనికానిచ్చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రైటర్‌ సేఫ్‌గార్డు సంస్థకు చెందిన కస్టోడియన్లు శ్రీనివాస్‌, నవీన్‌, సెక్యూరిటీ గార్డు అలీబేగ్‌, డ్రైవర్‌ కృష్ణ గురువారం మధ్యాహ్నం 1.40 ప్రాంతంలో కూకట్‌పల్లి నుంచి పటేల్‌కుంట వైపు వెళ్లేమార్గంలోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎమ్‌ కేంద్రానికి వచ్చారు. డ్రైవర్‌ వాహనంలో ఉండగా.. శ్రీనివాస్‌, నవీన్‌ రూ.11 లక్షలను ఏటీఎమ్‌లో పెట్టేందుకు వెళ్లారు. బయట సెక్యూరిటీగా అలీ బేగ్‌ తుపాకీతో నిలబడ్డాడు. ఇంతలో అల్విన్‌కాలనీ (పైపులైన్‌ రోడ్డు) వైపునుంచి పల్సర్‌ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు సెక్యూరిటీ గార్డు అలీబేగ్‌పై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన శ్రీనివాస్‌, నవీన్‌.. దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. శ్రీనివాస్‌పై దుండగులు కాల్పులు జరిపి.. నగదు బాక్సు నుంచి రూ.5 లక్షల బండల్‌ను ఎత్తుకెళ్లారు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. తుపాకీతో బెదిరించారు.

పట్టపగలే దోపిడీ

రాళ్లు విసురుతుండగానే అదే పల్సర్‌పై పరారయ్యారు. గాయపడ్డ అలీబేగ్‌, శ్రీనివాస్‌ను స్థానిక దవాఖానకు తరలించారు. అలీబేగ్‌ (74) చికిత్సపొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్‌కు మెరుగైన వైద్య చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు. ఘటనాస్థలిని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్వోటీ డీసీపీ సందీప్‌రావు, ఏసీపీ సురేందర్‌రావు తదితరులు సందర్శించారు. దుండగులు వదిలేసిన బుల్లెట్లు ఉండే మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీదారులు దేశవాళీ తుపాకీని ఉపయోగించినట్టు గుర్తించారు. ఏటీఎమ్‌ సెంటర్లోని సీసీ కెమెరాల్లో దోపిడీ దృశ్యాలు రికార్డయ్యాయి. కాల్పుల శబ్దంతో ఒక్కసారిగా కలవరానికి గురయ్యామని ఘటనాస్థలి సమీపంలోని ఫాస్ట్‌ఫూడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు, ప్రత్యక్ష సాక్షి నర్సింహారెడ్డి తెలిపారు. దుండగులను పట్టుకొనేందుకు ప్రయత్నించగా తుపాకీతో బెదిరించారని చెప్పారు. రాళ్లతో దాడి చేసినా తప్పించుకున్నారని చెప్పరు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పట్టపగలే దోపిడీ

ట్రెండింగ్‌

Advertisement