తనతోపాటు సీఎం పదవికి అర్హత ఉన్నది కేవలం కోమటిరెడ్డికేనంటూ రేవంత్‌రెడ్డి భువనగిరి సభలో చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. సీఎం మాటలపై కాంగ్రెస్ నాయకులు లోలోపల రగిలిపోతున్నారు. ఇది సీనియర్ నాయకులను చులకన చేయడమేనని వారు మండిపడుతున్నారు.
Congress | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ‘వాస్తవంగా నాతోపాటు ఎవరికైనా సీఎం పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే’ అంటూ భువనగిరి ఎన్నికల ప్రచారసభలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారానికి కారణమయ్యాయి. నాయకులెవరూ బహిరంగంగా స్పందించకపోయినప్పటికీ లోలోనమాత్రం ఉడికిపోతున్నారు. రేవంత్‌ను సమర్థించేవారు ఈ వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకుంటున్నప్పటికీ సీనియర్ నేతలైన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీనియర్ నాయకులు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి వంటివారు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి భట్టి పాదయాత్ర కూడా దోహదం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం పదవి కోసం చివరి క్షణం వరకు ఆయన పోటీపడ్డారు. చివరికి రాజకీయ పరిస్థితులు, సమీకరణల దృష్ట్యా ఆ పదవి చివరికి రేవంత్‌రెడ్డిని వరించింది. భట్టికి డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టారు. ఈ విషయంలో భట్టి భార్య నందిని బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంకటరెడ్డే సీఎం పదవికి అర్హుడని రేవంత్ చెప్పడం పుండుమీద కారం చల్లినట్టు అయింది. దీనికితోడు ఇటీవల జరుగుతున్న పరిణామాలు భట్టిని అవమానించేలా ఉంటున్నాయని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. రేవంత్ తన వ్యాఖ్యల ద్వారా భట్టికి సీఎం అయ్యే అర్హత లేదని పరోక్షంగా చెప్పారంటూ సీనియర్ నేతలు, ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అప్పుడు ఉత్తమ్ సీఎం అన్నారు
నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒకరు. గతంలో ఆయన పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయనే సీఎం అభ్యర్థి అన్న ప్రచారం కూడా జరిగింది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత సీఎం పదవిని ఆశిస్తున్న వారిలో ఆయన పేరు కూడా వినిపించింది. మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా సీఎం అయ్యే అర్హత ఉందన్నది అందరూ అంగీకరించే విషయమే. ఇంతమందిని కాదని వెంకట్‌రెడ్డి ఒక్కరికే ఆ అర్హత ఉందంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, పార్టీలోనూ హాట్ టాపిక్ అయ్యాయి.