Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ 171వ చిత్రమిది. సోమవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘కూలీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. టీజర్ యాక్షన్ హంగులతో ఆకట్టుకుంది.
గోల్డ్బిస్కెట్స్ స్మగ్లింగ్ చేసే ముఠా ఆటకట్టించే క్రమంలో రజనీకాంత్ చేసిన యాక్షన్ విన్యాసాలు టీజర్లో హైలైట్‌గా నిలిచాయి. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తనదైన మార్క్‌తో సన్నివేశాలను తీర్చిదిద్దాడు. ఖైదీ, విక్రమ్ వంటి చిత్రాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్.. రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌ను డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాలో తెలుగు అగ్ర హీరో నాగార్జున కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ గత చిత్రాలకు భిన్నంగా ప్రయోగాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం.