కారేపల్లి,సెప్టెంబర్ 27 : సాధారణంగా ఆదివారం బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ.. సెప్టెంబర్ 27న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేకంగా తెరుచుకున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా (ఆదివారం) నేడు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంచారు. దీంతో ఆదివారం కూడా బ్యాంకు శాఖల వద్ద ఖాతాదారుల సందడి కనిపించింది. నగదు జమ, నగదు ఉపసంహరణ, చెక్కులు, ఖాతాలకు సంబంధించిన ఇతర సాధారణ సేవలను వినియోగించుకునేందుకు పలువురు ఖాతాదారులు బ్యాంకులకు వచ్చారు.
సాధారణ సెలవు రోజున బ్యాంకులు పనిచేయడంతో అత్యవసర లావాదేవీలు ఉన్న వారికి కొంతమేర ఊరట లభించింది. మరోవైపు మూడు రోజుల సమ్మె కారణంగా సోమవారం నుంచి బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో ఖాతాదారులు ముందుగానే అవసరమైన లావాదేవీలు పూర్తి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఏ శాఖలో ఏయే సేవలు అందుబాటులో ఉంటాయన్నది బ్యాంకు, శాఖను బట్టి మారవచ్చని అధికారులు సూచిస్తున్నారు.