‘కల్కి 2898 ఏడీ’ విడుదల దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆదివారం పురాణపురుషుడైన అశ్వత్థామగా అమితాబ్‌బచ్చన్‌ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పడుకోన్ వంటి అగ్ర తారలు భాగమైన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం తెలుగు యువహీరోలు నాని, విజయ్ దేవరకొండ ‘కల్కి’ చిత్రంలో అతిథి పాత్రల్లో మెరవనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో మలయాళ అగ్రహీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో నాని, విజయ్ దేవరకొండ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారనే వార్త అభిమానుల్లో మరింత జోష్‌ను నింపుతున్నది. అయితే ఇందులో నిజానిజాలు తెలియాలంటే చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. మహాభారతకాలం నాడు మొదలై ఆరువేల సంవత్సరాల కాలవ్యవధిలో పూర్తయ్యే సైన్స్ ఫిక్షన్ కథాంశంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ముందస్తుగా ప్రకటించిన తేదీ ప్రకారం మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురావాల్సి ఉంది.