బన్సీలాల్‌పేట్, డిసెంబర్ 27: రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దీర్ఘకాల ఉద్యమం నిర్వహిస్తామని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రి రాఘవయ్య అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌లోని బోయిగూడ రైల్ కళారంగ్ ఆడిటోరియంలో సంఘ్ కార్యవర్గ, జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వేను కాపాడుకోవడానికి 2022 జనవరి నుంచి 2023 డిసెంబర్ వరకు 24 నెలల పాటు దీర్ఘకాల ఉద్యమం చేపడతామని వివరించారు. ఈ పోరాటానికి అన్ని సామాజిక సంఘాల మద్దతు కోరుతున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ ఇటీవల రూ.500 కోట్లతో అభివృద్ధి చేసిన అహ్మదాబాద్ వంటి కొన్ని రైల్వే స్టేషన్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాయని విమర్శించారు. దానివల్ల సంస్థకు ఎటువంటి అదనపు ఆదాయం రాలేదని చెప్పారు. రైల్వే కార్మికులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించాలని, కొవిడ్‌తో చనిపోయిన మూడువేల మంది రైల్వే కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిర్మిస్తున్న కొత్త రైల్వే లైన్ల నిర్వహణకు 4,500 పోస్టులు మంజూరు చేయాలని కోరారు. కొవిడ్ నిబంధనలను సాకుగా చూపి, వృద్ధులు, వికలాంగులు, వైద్యులు, జర్నలిస్టులు, మాజీ సైనికులకు రాయితీలను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనమని అన్నారు. సమావేశంలో సంఘ్ అధ్యక్షుడు జీ ప్రభాకర్ ఆండ్రూస్, సహాయ ప్రధాన కార్యదర్శి భరణి భానుప్రసాద్, షేఖ్ రవూఫ్, మోహన్‌రావు, రాజగోపాల్, ఉమానాగేంద్రమణి, ఎన్వీఎన్ చౌదరి, రవిశంకర్, రుద్రారెడ్డి, పలు డివిజన్ల నాయకులు పాల్గొన్నారు.
రైల్వే జీఎం గజానన్ మాల్యాకు సన్మానం
ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాను దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తరఫున సోమవారం రైల్ కళారంగ్ ఆడిటోరియంలో సన్మానించారు. గజానన్ మాల్యా జీఎంగా అద్భుతంగా పనిచేశారని సంఘ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రి రాఘవయ్య కొనియాడారు. కొవిడ్ నివారణ చర్యలను చేపట్టడంలో, సరుకు రవాణాను పెంచడంలో, దేశంలోనే ఎస్సీఆర్ను అగ్రగామిగా నిలబెట్టడంలో గజానన్ మాల్యా చేసిన కృషి మరచిపోలేమని చెప్పారు.