హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): పబ్లిక్ పాలసీకి సంబంధించి ప్రముఖ బ్రిడ్జ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం లండన్‌కు బయలుదేరి వెళ్లారు. లండన్‌లోని సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్లో శుక్రవారం ‘మహిళా రిజర్వేషన్ చట్టం-ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం’ అనే అంశంపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించే సదస్సులో కవిత కీలకోపన్యాసం చేస్తారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమ తీరుతెన్నులు, ఈ రిజర్వేషన్ల ద్వారా జరగబోయే మేలు, చట్టసభల్లో ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెంచడం, రాజకీయాల్లో మహిళల పాత్ర వంటి అంశాలపై కవిత ప్రసంగిస్తారు. శుక్రవారం ఉదయం లండన్‌లోని అంబేదర్ హౌస్ మ్యూజియాన్ని సందర్శించనున్నారు. శనివారం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అండ్ అలుమ్నీ యూనియన్ యూకే నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని కవిత ప్రసంగిస్తారు.