పెద్దకొడప్గల్, ఆగస్టు 29: కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని రామారావు మహారాజ్ తండాలో అటవీ అధికారులు ఇండ్లు కూల్చివేసిన ఘటనపై లోకాయుక్త కమిటీ గురువారం విచారణ చేపట్టింది. అటవీ భూముల్లో ఇండ్లను నిర్మించుకున్నారని మూడేండ్ల క్రితం అటవీ అధికారులు వాటిని కూల్చివేశారు. బాధితులు లోకాయుక్తను ఆశ్రయించగా, ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త కమిటీ సభ్యుడు మాథిక్ కోషి గురువారం రామారావు మహారాజ్ తండాకు వచ్చి విచారణ చేపట్టారు. బాన్సువాడ ఆర్డీవో నుంచి కూడా వివరాలు సేకరించారు.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): హైడ్రా ముసుగులో పెద్దఎత్తున బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చినట్టు స్వయంగా సీఎం రేవంత్రెడ్డి కూడా మీడియా ముఖంగా చెప్పారని గుర్తుచేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే ఇక హైడ్రా పారదర్శకత ఎక్కడ ఉన్నదని నిలదీశారు. అసెంబ్లీ మీడియా హాల్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. చెరువుల ఆక్రమణలను కూల్చడాన్ని బీజేపీ స్వాగతిస్తున్నదని, అయితే ఆక్రమణలపై ప్రభుత్వం దూకుడు తగ్గించకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. పాతబస్తీ సలం చెరువు వద్ద జరుగుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చే విషయంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించాలని కోరారు. సలం చెరువులో అక్రమంగా నిర్మించిన ఒవైసీ భవనాలకు ప్రత్యేక సమయం ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంఐఎంకు భయపడి పాతబస్తీ వైపు చూడటం లేదని ఆరోపించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన అధికారిక హోదాను వదిలిపెట్టి, రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘మీరు కమిషనరా లేదా పొలిటికల్ లీడరా?’ అని ప్రశ్నించారు.