Election Results | హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం 20 రోజులపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. దేశవ్యాప్తంగా జూన్ 4న మంగళవారం ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. తెలంగాణలో లెక్కింపు కేంద్రాలలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేయనున్నారు.
500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టేబుల్స్ సంఖ్య పెరుగుతుంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపుతో పాటు 500 పోస్టల్ బ్యాలట్ ఓట్లకు ఒక టేబుల్‌ను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో పోలైన పోస్టల్ బ్యాలట్లను ఆయా నియోజకవర్గపు రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో భద్రపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా 44 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. స్ట్రాంగ్‌రూంల వద్ద కేంద్ర బలగాల బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలు, అభ్యర్థుల ఎజెంట్ల సమక్షంలో నిరంతరం పర్యవేక్షిస్తారు.