Lok Sabha Elections | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): లోక్‌సభకు నిర్ణీత గడువుకన్నా ముందుగానే ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయపార్టీలు అందుకు సమాయత్తమవుతున్నాయి. నిర్ణీత గడువుకు నెల ముందే లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందన్న ప్రచారానికి బలం చేకూర్చేలా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను రూపొందించే పనిని చురుకుగా కొనసాగిస్తున్నది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా సోమవారం జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో లోక్‌సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్ణీత గడవు కన్నా ముందే వస్తాయని సంకేతాలు ఇచ్చారు. దీనికి అనుగుణంగా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్చార్జీలను ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైందని, లోక్‌సభ ఎన్నికల్లో జాప్యం చేయకూడదని సూచించినట్టు తెలిసింది.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. ఈ నెల 28 నుంచే ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెలలో ప్రారంభించకపోతే జనవరిలో రెండువారాలపాటు మంచి రోజులు ఉండవని, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల కసరత్తు ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. డిసెంబర్ ఆఖరుకల్లా గ్యారెంటీల అమలు మొదలుపెట్టకపోతే లోక్‌సభ ఎన్నికల్లో అభాసు పాలయ్యే అవకాశం ఉంటుందని ఆ పార్టీ భావిస్తున్నది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి రెండోవారంలోపే వస్తుందని, అప్పుడు మే వరకు గ్యారెంటీల అమలు సాధ్యం కాదని భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా వైసీపీ మొదలుపెట్టింది. టీడీపీ కూడా పాదయాత్రలు, సభల పేరుతో హడావుడి చేస్తున్నది.
ఏప్రిల్ తొలివారంలో పోలింగ్?
లోక్‌సభ ఎన్నికలపై ఊహాగానాలను బీఆర్ఎస్ కూడా నిశితంగా గమనిస్తున్నది. క్షేత్రస్థాయిలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమీక్షలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పార్టీ అధినేత కేసీఆర్ కూడా కొద్దిరోజుల్లోనే సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా 6-7 విడతల్లో పోలింగ్ జరుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తొలిదశలోనే తెలంగాణ ఎన్నికలుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలిదశ ఎన్నికలు ఏప్రిల్ పదో తేదీలోపే ఉంటాయని, తెలంగాణలో ఏప్రిల్ తొలివారంలోనే ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. మలిదశ పోలింగ్ మే తొలివారం వరకు ఉంటుందని, ఫలితాలు మే 15 లోపే ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నది.