Lok Sabha Elections | సారంగాపూర్/చిలిపిచెడ్ (కొల్చారం), మే 13: సెలవు ఇచ్చినా ఓటేయకుండా పట్టణవాసులు ముఖం చాటేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెలు ఓటుతో చైతన్యాన్ని చాటుతున్నాయి. సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్నకొల్వాయిలో 100 శాతం పోలింగ్ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటేశారు. వంద శాతం ఓటింగ్‌కు కృషి చేసిన సెక్టోరల్ ఆఫీసర్ చక్రు నాయక్, కార్యదర్శి ముద్దం విజయ, బీఎల్వో యశోద, రూట్ అధికారి రాజ్‌కుమార్‌ను కలెక్టర్ యాస్మిన్ బాషా ఫోన్ చేసి అభినందించారు.
కాగా మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటతండాలోని అదనపు పోలింగ్ కేంద్రంలోనూ వంద శాతం పోలింగ్ జరిగింది. సంగాయిపేటతండా 62ఏ అదనపు పోలింగ్ కేంద్రం పరిధిలో 210 మంది ఓటర్లు ఉండగా అంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో చాలా మంది నిరక్ష్యరాలైనప్పటికీ చైతన్యంతో తమ ఓటు వేశారు.