ఆదిలాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై ప్రజలు తిరగబడుతున్నారు. అసమర్ధ పాలన, ముందు చూపులేని నిర్ణయాలపై ఎక్కడిక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులను అడ్డుకుంటు న్నారు. తాజాగా హైడ్రా తరహాలో ఆదిలాబాద్ జిల్లాలో కూల్చివేతలకు రంగం సిద్ధం చేసేందుకు వెళ్లిన అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్(Khanapur) చెరువు పరిసర ప్రాంతాల్లోని ఇండ్ల మార్కింగ్ కోసం రెవెన్యూ, మున్సిపల్( Rvenue officials) అధికారులు వెళ్లారు. ఎన్నో ఏండ్లుగా ఉంటున్న తమ ఇండ్లు కూల్చవద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. మార్కింగ్ చేయకుండా అధికారులను అడ్డుకున్నారు. దీంతో చేసేదేమిలేక అధికారులు అక్కడ నుంచి వెనుదిరిగారు.
కాగా, కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. మూసీ- హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డారని ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపైనా దాడికి తెగబడ్డారు. గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ముషీరాబాద్‌లో కేటీఆర్ కారును అడ్డుకున్నారు. ఆపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ గూండాలు ఏ మాత్రం తగ్గలేదు. కొందరైతే ఏకంగా కారుపైకి ఎక్కి మరీ దురుసుగా ప్రవర్తించారు. చివరకు బీఆర్ఎస్ శ్రేణులు వారిని తన్ని తరిమివేశారు. అనంతరం అంబర్‌పేట గోల్నాక పరిధిలోని తులసీరామ్ నగర్ వెళ్లిన కేటీఆర్ అక్కడ మూసీ బాధితులను పరామర్శించారు.