పరిగి, అక్టోబర్ 3 : ‘సీఎం రేవంత్‌రెడ్డికి ఒక్కరికే పండుగనా.. మాకు పండుగ లేదా.. మేము సకాలంలో ఇండ్లకు వెళ్లొద్దా? అంటూ పరిగి వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పండుగ పూట గంటకు పైగా వాహనాలు నిలిపివేయడం ఏంటని పోలీసులను నిలదీశారు. గురువారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్‌కు వెళ్తున్న సందర్భంగా పరిగిలో పోలీసులు సుమారు గంటకు పైగా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. రాత్రి 9.10 గంటల నుంచి సుమారు గంటకు పైగా పరిగి పట్టణంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
దసరా పండుగ కోసం హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్తున్న వారంతా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. గంటకుపైగా ట్రాపిక్ నిలిపివేతతో రాత్రి సమయంలో తమ ఇండ్లకు ఎప్పుడు వెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పండుగ సమయంలో ప్రజలను సీఎం ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనదారులను పోలీసులు సముదాయించారు.